తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతపై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు విద్యాసంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికొచ్చినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటనను తప్పుబడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రైవట్ స్కూళ్ల యాజమాన్యాలు, టీచర్లు పాఠశాలల మూసివేతను...
హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతపై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు విద్యాసంస్థలను మూసివేయాలన్న నిర్ణయానికొచ్చినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటనను తప్పుబడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు, టీచర్లు పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. విద్యాసంస్థలకు మాత్రమే కరోనా ముప్పు పొంచి ఉందా.. థియేటర్లు, క్లబ్స్, పబ్స్, బార్లలో గుంపులుగా కూర్చునే వారికి కరోనా రాదా అని ప్రభుత్వాన్ని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. స్కూళ్లు మూసివేత నిర్ణయంపై వెనక్కి తగ్గే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోతే బార్ల లైసెన్సులైనా తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకే విద్యా సంస్థలను మూసివేసినట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. పొరుగున ఉన్న చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్ అయ్యాయని, తెలంగాణలో మాత్రమే కాదని ప్రభుత్వ ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఏపీలో బడులు మూసివేసే ఉద్దేశం లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువగానే వస్తున్నాయని, కేవలం తెలంగాణలో మాత్రమే విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంలో అర్థమేంటని ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కాలేజీల్లో అన్ని కోర్సులకు, స్కూళ్లలో 9,10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించవచ్చని ఫిబ్రవరి 1న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 24 నుంచి 6,7,8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. క్లాసులు మొదలుపెట్టామని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకున్నాయి. మళ్లీ కరోనా వ్యాప్తి పెరగడంతో విద్యాసంస్థల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కట్టించుకున్న ఫీజు సంగతేంటని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తుండటంతో స్కూల్స్ తెరవడానికి అనుమతినివ్వాల్సిందేనంటూ ప్రైవేట్ యాజమాన్యాలు రోడ్డెక్కిన పరిస్థితి తెలంగాణలో నెలకొంది. తెలంగాణలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన 50 రోజులకే స్కూల్స్, కాలేజీలు మళ్లీ మూతపడటం గమనార్హం. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యా సంస్థలకు ప్రభుత్వం సూచించింది. ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి విద్యా సంస్థలను మూసివేస్తున్నామని, ఇంటర్, టెన్త్, ఇతర పరీక్షలపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.