దేశ విద్యావ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (New Education Policy)ని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పీఎం శ్రీ యోజన (PM SHRI- Pradhan Mantri Schools For Rising India) అనే కొత్త పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. ఈ స్కీమ్ కింద 14,000 పాఠశాలలను పీఎం శ్రీ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా- పీఎం శ్రీ యోజన కింద.. దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేసి, అప్‌గ్రేడ్ చేస్తామని, ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. తాజా స్కీమ్‌తో పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానం స్ఫూర్తితో మోడల్ పాఠశాలలుగా మారుతాయని మోదీ అన్నారు.
* 14,500 పాఠశాలల అభివృద్ధి
ఈ సందర్భంగా మోదీ చేసిన ట్వీట్లలో.. ‘ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM-SHRI) యోజన కింద భారతదేశం అంతటా 14,500 పాఠశాలల డెవలప్మెంట్, అప్‌గ్రేడేషన్‌కి కొత్త చొరవను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను.
ఇవి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్ఫూర్తిని నింపే మోడల్ పాఠశాలలుగా మారుతాయి. పీఎం శ్రీ పాఠశాలలు విద్యను అందించడానికి ఆధునిక, పరివర్తన, సంపూర్ణ విధానాన్ని కలిగి ఉంటాయి. డిస్కవరీ- ఓరియంటెడ్, లెర్నింగ్-సెంట్రిక్ బోధనా విధానంపై దృష్టి పెడతాయి. అత్యాధునిక సాంకేతికత, స్మార్ట్ క్లాసులు, క్రీడలకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.’ అని పేర్కొన్నారు.
* లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇటీవలి సంవత్సరాలలో విద్యా రంగాన్ని మార్చిందని పీఎం మోదీ అన్నారు. ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా పీఎం శ్రీ పాఠశాలలు భారతదేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయని కచ్చితంగా నమ్ముతున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న పాఠశాలల నుంచి ఎంపిక చేసి, ప్రస్తుత పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకం అమలవుతుందన్నారు. పీఎం శ్రీ పాఠశాలలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పాటిస్తూ ఆదర్శంగా ఉండటమే కాకుండా, సమీపంలోని ఇతర పాఠశాలలకు మార్గదర్శకత్వం కూడా అందిస్తాయని వివరించారు.
* అధునాత సౌకర్యాల కల్పన
ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘ఈ పాఠశాలల లక్ష్యం మెరుగైన బోధన, అభ్యాసం, అన్ని విధాల అభివృద్ధి మాత్రమే కాకుండా, 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ, సుసంపన్నమైన వ్యక్తులను సృష్టించడం.’ అని తెలిపింది. ఈ పాఠశాలల్లో అవలంబించే బోధనా విధానం మరింత అనుభవపూర్వకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, ఆట/బొమ్మల ఆధారంగా, విచారణ-ఆధారితంగా, ఆవిష్కరణ-ఆధారితంగా ఉంటుందని పేర్కొంది.
ఈ పాఠశాలల్లో ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, స్పోర్ట్స్ పరికరాలు, ఆర్ట్ రూమ్ మొదలైన ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ పాఠశాలలు నీటి సంరక్షణ, వ్యర్థాల రీసైక్లింగ్, ఇంధన-సమర్థవంతమైన హరిత పాఠశాలలుగా కూడా అభివృద్ధి చెందుతాయని పీఎంవో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, PM Narendra Modi