లా కోర్సు చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ (Indian Students)కు గుడ్‌న్యూస్. న్యాయశాస్త్రంలో పరిశోధనలు చేయాలనుకునే వారికోసం ఫుల్లీ ఫండెండ్ స్కాలర్షిప్ అందిస్తున్నట్లు ప్రకటించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అనే లా ఫర్మ్ మేనేజింగ్ పార్ట్నర్ సిరిల్ ష్రాఫ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సోమర్విల్లే కాలేజీ పరిధిలోని ఆక్స్ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ ఫెలోషిప్ అందించనున్నాయి. ఎంపికైన భారత విద్యార్థులు ‘సిరిల్ ష్రాఫ్ స్కాలర్షిప్స్’ (Cyril Shroff Scholarships) పేరుతో స్కాలర్షిప్ అందుకోనున్నారు.
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన స్కాలర్స్.. ఆక్స్ఫర్డ్ ఇండియా సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్(OICSD), యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నుంచి గైడెన్స్ పొందుతారు. భారతదేశంలో చట్టం, పబ్లిక్ పాలసీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి ద్వారా ప్రజలకు నష్టం జరిగితే వాటి మార్పునకు కృషి చేయాల్సిన బాధ్యత స్కాలర్స్పైన ఉంటుంది.
వాతావరణ సంక్షోభానికి గల కారణాలు, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలపైన వీరు స్టడీ చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాలు, పాలసీల లోటుపాట్లను సునిశితంగా పరిశీలించడంతో పాటు పర్యావరణ మార్పులకు గల కారణాలు, సస్టైనబిలిటీ కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయాలపై స్టూడెంట్స్ పరిశోధన చేయాల్సి ఉంటుంది.
* ప్రస్తుతానికి తక్కువ మందికే
పూర్తి నిధులతో కూడిన స్కాలర్షిప్లు (Fully funded scholarships) అంటే.. విద్యార్థులు కోర్సు చదువుతున్నప్పుడు అవసరమయ్యే ట్యూషన్ ఫీజు, ఫుడ్ బిల్లు, హౌసింగ్, బుక్స్ వంటి అన్ని ఖర్చులను కవర్ చేసేవి. కోర్సు ప్రారంభమైన సంవత్సరం నుంచి పూర్తయ్యే సంవత్సరం వరకు స్కాలర్షిప్ అందుతుంది.
ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మొదటి సంవత్సరంలో దేశంలోని ముగ్గురు విద్యార్థుల పూర్తి ఖర్చులను సిరిల్ లా ఫర్మ్ కవర్ చేస్తుంది. క్రమంగా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని సంస్థ పేర్కొంది. అయితే ఎంత మొత్తంలో ఫండ్స్ అందజేస్తారు, ఒక్కో విద్యార్థికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అనే వివరాలను ఈ సంస్థ వెల్లడించలేదు. కానీ మొదటి బ్యాచ్ 2023 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది.
* సిరిల్ ఆలోచనల నుంచి..
సిరిల్ ష్రాఫ్ ప్రఖ్యాత ఇండియన్ కార్పొరేట్ లాయర్. న్యాయవాద వృత్తిలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోనే సోమర్విల్లే కాలేజీ ద్వారా ప్రారంభించానని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో మూడు భాగాలుంటాయని అవి నేర్చుకోవడం, సంపాదించడం, తిరిగి వెనక్కి ఇవ్వడం అని అన్నారు. తిరిగి ఇవ్వడంలో భాగంగానే తాను లా చదవాలనుకునే వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు స్కాలర్షిప్ ఇస్తున్నట్లు వివరించారు. ఇది ఇండియాకు బ్రెయిన్ గెయిన్ లాంటిదని అన్నారు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచం కోసం చక్కటి న్యాయవాదులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సిరిల్ ష్రాఫ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా ఆక్స్ఫర్డ్ లా అండ్ పబ్లిక్ పాలసీ స్కాలర్స్ చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Scholarship, Scholarships