ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. వీటిల్లో అడ్మిషన్ (Admission) సంపాదించడం చాలా కష్టం. పోటీ ఎక్కువ, భర్తీ చేసే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అతి కొద్ది మందికి మాత్రమే ఐఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది. అయితే సీటు లభించని వారు కూడా ఇంటర్న్‌షిప్, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా ఐఐటీల్లో చదవచ్చు. ఐఐటీ రూర్కీ (IIT Roorkee) కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తోంది. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌పై ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇందుకు ప్రముఖ EdTech కంపెనీ Imarticus Learning సహకారం అందిస్తోంది. ఐదు నెలల పాటు జరిగే ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ జూన్ 30 నుంచి ప్రారంభమవుతుంది. తరగతులు వారాంతాల్లోనే నిర్వహించనున్నారు.
ఐఐటీ రూర్కీ, గౌహతి, రోపర్‌కు చెందిన ఫ్యాకల్టీ సభ్యులతో పాటు డేటా సైన్స్ విభాగానికి చెందిన నిపుణుల నేతృత్వంలో లైవ్ ఆన్‌లైన్ సెషన్లు కొనసాగనున్నాయి. అభ్యర్థులు డేటా సైన్స్‌లో బలమైన పునాదిని నిర్మించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ దోహదపడుతుంది. అలాగే డేటా-బేస్డ్ డిసీజన్ మేకింగ్ కోసం పైథాన్ ద్వారా మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుందని ఐఐటీ రూర్కీ పేర్కొంది.
అత్యంత నాణ్యతతో కూడిన వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి Imarticus Learning సంస్థతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎదురు చూస్తున్నామని ఐఐటీ రూర్కీ పేర్కొంది. అందులో భాగంగానే ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. తద్వారా అభ్యర్థులు అర్థవంతమైన డేటా నైపుణ్యాలను సాధించి వ్యాపార వృద్ధిలో భాగస్వామ్యం కానున్నారని పేర్కొంది.
డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో ఉన్నత విద్యావేత్త, ప్రొఫెసర్ ఆర్ బాల సుబ్రమణియన్ ఈ కోర్సును కోఆర్డినేట్ చేయనున్నారు. అలాగే భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ విభాగం (DST), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ, ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (NM-ICPS) నేషనల్ మిషన్ కింద ఇమార్టికస్ లెర్నింగ్ ఉమ్మడి చొరవతో ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి రానుంది. ప్రోగ్రామ్ సర్టిఫికేట్‌ను iHUB దివ్యసంపర్క్ జారీ చేస్తుంది.
కోర్సు ముగింపులో క్యాంపస్ ఇమ్మర్షన్ మాడ్యూల్ ప్రోగ్రామ్ ఉంటుందని.. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్, పీర్-పీర్ నెట్‌వర్కింగ్ కోసం విద్యార్థులు iHUB దివ్యసంపార్క్ గ్రేటర్ నోయిడా క్యాంపస్‌కు రానున్నారని ఐఐటీ రూర్కీ తెలిపింది.
iHUB దివ్యసంపర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీష్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇమార్టికస్ లెర్నింగ్‌తో భాగస్వామ్యం కుదర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్ (NM-ICPS) ఆదేశాలలో నైపుణ్యాభివృద్ధి ఒకటని, ఇది పరిశ్రమ 4.0, సొసైటీ 5.0 కోసం భారతదేశాన్ని సిద్ధం చేస్తుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.