డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కేంద్రం ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (CUET UG 2023)ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. మరి కొద్ది రోజుల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన ప్రకటన చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
* యూజీసీ ఛైర్మన్ ప్రకటన
సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణ సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులోకి రాగానే ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చని జగదీష్ కుమార్ సూచించారు. ‘సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది’ అని జగదీష్ కుమార్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
* మే నెలలో పరీక్షలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు ఈ ఏడాది మే 21 నుంచి మే 31 వరకు జరగనున్నాయి. జూన్ మూడో వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. వాస్తవానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గడువు వాయిదా పడింది.
తాజాగా, యూజీసీ ఛైర్మన్ ప్రకటనతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైందని కన్ఫర్మ్ అయింది. గతేడాది మాదిరిగానే 13 భాషల్లో సీయూఈటీ యూజీ 2023 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి : నీట్ పీజీ వాయిదా ఆందోళనల మధ్య కేంద్రం కీలక నిర్ణయం.. ఇంటర్న్‌షిప్ గడువు పొడిగింపు
* 1000 పరీక్షా కేంద్రాలు
ఈ ఏడాది మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్యను 1000కి పెంచారు. ఫలితంగా పరీక్షలు సాఫీగా సాగేందుకు ఆస్కారముంటుంది. గతేడాది ప్రతి సబ్జెక్టుకు 450 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు సీయూఈటీ యూజీ 2022 పరీక్షను నిర్వహించారు. మొత్తంగా 14.9లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
* సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు
సీయూఈటీ యూజీ 2023 పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ప్రముఖ కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cuet, EDUCATION, JOBS