జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ అభ్యర్థులకు అలర్ట్. ఎట్టకేలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ -2023 సెషన్-2 కోసం ఎన్‌టీఏ తాజాగా రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12గా నిర్ణయించారు. జేఈఈ మెయిన్ అర్హత ప్రమాణాలు, అప్లికేషన్ ప్రాసెస్ తదితర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* అర్హత ప్రమాణాలు
ఇంటర్ పాసైన అభ్యర్థులు జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 హాజరైన అభ్యర్థులు సెషన్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, మునుపటి అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి, సెషన్ 2 కోసం పేపర్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సిటీలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండు సెషన్స్‌లో దేంట్లో ఎక్కువ స్కోర్ వస్తుందో దాన్ని ర్యాంక్ కోసం పరిగణలోకి తీసుకోనున్నారు.
* అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి, జేఈఈ మెయిన్ -2023 సెషన్- 2 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
ఇది కూడా చదవండి : గుర్తింపు లేకుండా 695 యూనివర్సిటీలు.. లోక్ సభలో మంత్రి కీలక విషయాలు వెల్లడి..
పర్సనల్, అకడమిక్ వివరాలను ఎంటర్ చేయడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆ తరువాత జేఈఈ మెయిన్ సెషన్-2 అప్లికేషన్ ఫీజు చెల్లించండి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోండి.
* 13 భాషల్లో పరీక్ష
JEE మెయిన్-2023 సెషన్-2 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచులర్స్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు
* మార్చి చివరిలో అడ్మిట్‌కార్డ్స్
షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. సెషన్-2కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్ వివరాలు మార్చి మూడో వారంలో జారీ చేయనున్నారు. ఇక, అడ్మిట్ కార్డ్ మార్చి చివరిలో విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS