ఇండియన్ యూనివర్సిటీలు అందించే ఆన్‌లైన్ కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనాలనుకునే విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) ద్వారా యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోరుకునే విదేశీ విద్యార్థులు ఇకపై ఐడెంటిఫికేషన్ ఫ్రూప్‌గా పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేదు. గతంలో యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో ఎంఈఏ ద్వారా అడ్మిషన్లు పొందాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు తప్పనిసరిగా ఐడెంటిఫికేషన్‌గా పాస్‌పోర్ట్‌ను చూపించాల్సి ఉండేది. అయితే సెకండ్ అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్ -2022 ప్రకారం.. పాస్‌పోర్ట్ స్థానంలో ఫోటోతో కూడిన రెసిడెంట్ కంట్రీకి చెందిన ఏదైనా జాతీయ గుర్తింపు కార్డును చూపిస్తే సరిపోతుందని యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీష్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ నిబంధనల్లో సవరణలు చేశారు. దీంతో యూజీసీ గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల్లో చేరడానికి ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ప్రోత్సహించడానికి మార్గం సుగమవుతుందని యూజీసీ చైర్మన్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఇ- విద్యాభారతి (e-VidyaBharati) ప్రాజెక్ట్ ద్వారా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆఫ్రికన్ స్టూడెంట్స్ కోసం స్కాలర్‌షిప్‌లను ఆఫర్ చేస్తోంది. ఐదేళ్ల కాలంలో ఆఫ్రికన్ స్టూడెంట్స్‌కు కనీసం 15000 స్కాలర్‌షిప్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ ఇ- విద్యాభారతి పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అయితే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.
గడువు పాస్‌పోర్టు సమర్పించడం, లేదా పాస్‌పోర్ట్ సమర్పించడంలో విఫలం కావడంతో చాలా మంది విదేశీ అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఫొటోగ్రాఫ్‌తో కూడిన ఏదైనా నేషనల్ ఐడెంటిటీ కార్డు’ను కన్సిడర్ చేయాలని యూజీసీని అభ్యర్థించింది. అలాగే ఇ-విద్యాభారతి ప్రాజెక్ట్ కింద ఇండియన్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందాలంటే ‘పాస్‌పోర్ట్ తప్పనిసరి’ నిబంధనను మినహాయించాలని కూడా కోరినట్లు అధికారులు తెలిపారు.
* పెరగనున్న విదేశీ విద్యార్థుల పార్టిసిపేషన్
తాజా మార్పుల కారణంగా ఎంఈఏ ద్వారా ఆన్ లైన్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని యూజీసీ చైర్మన్ కుమార్ అభిప్రాయపడ్డారు. విదేశీ వ్యవహారాల శాఖతో సంబంధం లేకుండా యూజీసీ గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌లో అడ్మిషన్ పొందాలనుకునే విదేశీ విద్యార్థులు తప్పనిసరిగా పాస్ పోర్ట్‌ను ఐడెంటిఫికేషన్‌గా చూపించాల్సిందేనని యూజీసీ స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.