త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కొత్త పద్దతిని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. అగ్నిపథ్ ద్వారా ఎంపికయ్యే వారిని అగ్నివీరులు అంటారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు అగ్నివీరులుగా సేవలందిస్తూనే తమ చదువును కొనసాగించవచ్చు. ఇందుకోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) అవసరమైన కోర్సులను అభివృద్ధి చేయనుంది. తద్వారా 12వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఇవ్వనునుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులతో సంప్రదించి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనుందని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది.
యువకులు సాయుధ దళాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో చేరడం కోసం పాన్ ఇండియా మెరిట్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పథకం ‘అగ్నిపత్’ను తీసుకొస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా శిక్షణ కాలంతోపాటు మొత్తంగా 4 సంవత్సరాలు "అగ్నివీర్"గా సాయుధ దళాలలో పనిచేసే అవకాశం యువకులకు కల్పించనున్నారు. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న తరువాత ప్రతి బ్యాచ్‌లోని 25 శాతం మంది అగ్నివీరులను రెగ్యులర్ సర్వీస్ కోసం రిటైన్ చేసుకోనున్నారు. సంస్థాగత అవసరాలు, సాయుధ దళాలు ఎప్పటికప్పుడు ప్రకటించే పాలసీల ఆధారంగా రిటైన్ పాలసీ ఉండనుంది.
17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అగ్నిపథ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 10, 12వ తరగతి పాసైన విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది.
‘10వ తరగతి ఉత్తీర్ణత సాధించి అగ్నివీరులుగా సేవలందించే వారు తమ చదువులను కొనసాగించడానికి వీలుగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ స్పెషల్ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేయనుంది. కస్టమైజ్డ్ కోర్సులను డెవలప్ చేసి తద్వారా అగ్నివీరులకు 12వ తరగతి పాస్ సర్టిఫికేట్ అందజేయనుంది.’ అని కేంద్ర విద్యాశాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
‘ఎన్‌ఐఓఎస్ అందించే సర్టిఫికేట్ ద్వారా దేశంలో ఎక్కడైనా ఉద్యోగవకాశాలను పొందవచ్చు. లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. తగిన విద్యార్హత, నైపుణ్యాలను పొందేందుకు కూడా ఈ సర్టిఫికేట్ అగ్నివీర్లకు ఉపయోగపడనుంది. NIOS ఓపెన్ స్కూల్ సిస్టమ్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీర్లకు సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది.’ అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
కాగా, రక్షణ శాఖలో సేవలందించే అగ్నివీరుల కోసం ప్రత్యేక మూడు సంవత్సరాల స్కిల్ బేస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) డిజైన్ చేయనుంది. ఇందుకోసం ఇగ్నోతో అవగాహన ఒప్పందం కుదర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Army jobs, Indian Army, JOBS