మెడికల్ కళాశాలల్లో మాస్టర్ ఆఫ్ సర్జరీ(MS), డాక్టర్ ఆఫ్ మెడిసిన్(MD), పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నీట్ పీజీ (NEET PG ) నిర్వహిస్తారు. ప్రస్తుతం నీట్ పీజీ అభ్యర్థులు ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు పరీక్ష తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ 2023 ప్రవేశ పరీక్షకు అర్హత సాధించేందుకు అమలులో ఉన్న ఇంటర్న్‌షిప్ గడువును కేంద్రం మరోసారి పెంచింది. ఈ ఏడాది ఆగస్టు వరకు పెంచుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే గడువు పెంచినప్పటికీ మార్చిలో జరిగే నీట్ పీజీ 2023 పరీక్ష రాయడానికి అభ్యర్థులకు వీలు కల్పించింది.
* రెండో సారి పొడిగింపు
మెడికల్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యసించడానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్(NEET PG) అభ్యర్థులు పరీక్షను రాయాల్సి ఉంటుంది. అయితే దీనికన్నా ముందు అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. అభ్యర్థులకు మార్చి 31 వరకు ఇంటర్న్‌షిప్ గడువు ఉంటుందని తొలుత పేర్కొంది. ఈ గడువును గతంలో జూన్ 30కి పొడిగించింది. తాజాగా ఆగస్టు 11 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను రీ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది.
* పరీక్షకు అవకాశం
2023 జులై 1 నుంచి 2023 ఆగస్టు 11 మధ్యలో ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు నీట్ పీజీ 2023 పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. నీట్ పీజీ 2023 నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 3గంటల నుంచి 12న రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి : అభ్యర్థులకు అలర్ట్.. NEET PG 2023 రీ షెడ్యూల్ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://natboard.edu.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారిక ప్రకటన ప్రకారం మార్చి 5న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27న అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. మార్చి 31న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. జులైలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* ఫేక్ న్యూస్
గత కొన్ని రోజులుగా నీట్ పీజీ 2023 పరీక్ష తేదీని వాయిదా వేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కేంద్రం స్పందించి పరీక్ష తేదీని వాయిదా వేసిందని సోషల్ మీడియాల్లో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ వదంతులేనని కేంద్రం స్పష్టం చేసింది. ఫేక్ వార్తలను నమ్మొద్దని అభ్యర్థులకు సూచించింది. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. మే 21కి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కనిపిస్తున్న నోటీసు ఫేక్ అంటూ కొట్టిపారేసింది. ఇలాంటి మెసేజ్‌లను షేర్ చేయొద్దని నెటిజన్లను కోరింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET, Neet pg