NEET: నీట్​ పరీక్షపై కేంద్రం కీలక చర్చలు.. వచ్చే ఏడాది నుంచి ఏటా రెండుసార్లు నిర్వహించే అవకాశం

ప్రతీకాత్మకచిత్రం

మెడికల్​, డెంటల్​, ఆయుష్​ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే నీట్​ ఎగ్జామ్​కు ఏటా లక్షలాది మంది పోటీ పడుతుంటారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ ఎంట్రన్స్​ టెస్ట్​​ను​ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని యోచిస్తున్నాయి.

  • Share this:
మెడికల్​, డెంటల్​, ఆయుష్​ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే నీట్​ ఎగ్జామ్​కు ఏటా లక్షలాది మంది పోటీ పడుతుంటారు. ఈ ఎంట్రన్స్​ ఎగ్జామ్​కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్ ఎంట్రన్స్​ టెస్ట్​​ను​ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఈ కొత్త విధానాన్ని తొలుత ఈ సంవత్సరం నుంచే అమలు చేయాలని కేంద్రం భావించింది. దీనికి సంబంధించి కేంద్రం చర్చలు జరిపింది. అయితే వచ్చే సంవత్సరం నుంచి కచ్చితంగా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది.

ఈ నూతన విధానంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ (DG) వినీత్ జోషి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రతిష్టాత్మక సంస్థల్లో మెడికల్​ ఎంట్రన్స్ కోసం నీట్​ ఎంట్రన్స్​ టెస్ట్​ను ఏటా ఒక్కసారే నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహించాలని యోచిస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. వచ్చే విద్యా సంవత్సరం లేదా నీట్–2022 నుంచి ఈ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే అవకాశం ఉంది” అని చెప్పారు. కాగా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రిగా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఉన్నప్పుడు ఇదే అంశంపై చర్చలు జరిగాయి. విద్యా, ఆరోగ్య శాఖల మధ్య సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల దీనికి ముందడుగు పడలేదు. ఏదేమైనా, వచ్చే ఏడాది నుంచి నీట్​ ఎంట్రన్స్​ టెస్ట్​ను ఏటా రెండు సార్లు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.

విద్యార్థుల నుంచి పెరుగుతున్న డిమాండ్​..

ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, నీట్​ ఎంట్రన్స్​ టెస్ట్​ పెన్, పేపర్ ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం కూడా ఇదే విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇంజినీరింగ్​లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్స్ అటెంప్ట్​లను ఇటీవల పెంచారు. దీంతో నీట్‌ పరీక్షను కూడా ఏటా రెండు సార్లు నిర్వహించాలని విద్యార్థుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) విద్యార్థి సంఘం విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు లేఖ రాసింది.

"నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏడాది నాలుగు సార్లు JEE ని నిర్వహించింది. ప్రతి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. నీట్, మెడికల్, క్లాట్‌తో సహా అనేక ఇతర జాతీయ పరీక్షలకు కూడా ఇదే విధానాన్ని అవలంభించాలి’’ అని ఎస్​ఐఓ లేఖలో పేర్కొంది.
Published by:Krishna Adithya
First published: