నీట్ (NEET)- యూజీ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా తమ వాయిస్‌ను వినిపిస్తున్నారు. #JUSTICEforNEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్(Twitter) లో ట్రెండ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్షగా.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG) పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి NEET పరీక్ష జూలై 17న జరగనుంది. అయితే నీట్- యూజీపరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వాయిస్‌ను వినిపిస్తున్నారు. #JUSTICEforNEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. నీట్ కోసం ప్రిపేర్ కావడానికి తమకు మరికొంత సమయం కావాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు నీట్‌ను కనీసం 40 రోజులు వాయిదా వేయాలని NTAని కోరుతున్నారు. దీంతో మరింత సమర్థవంతంగా సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందంటున్నారు.
అంతేకాకుండా జాతీయస్థాయిలో జరిగే అనేక ప్రవేశ పరీక్షలు క్లాష్ అవుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. నీట్-2022తో పాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) కోసం కూడా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిపరేషన్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంటుందని విద్యార్థులు పేర్కొన్నారు. CUET- 2022 జూలై మొదటి లేదా రెండో వారంలో జరుగుతుంది. దీంతో మెడికల్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ కావడానికి కొన్ని రోజుల సమయమే ఉండడంతో తమపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ కారణంగానే జేఈఈ మెయిన్ వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులు హైలైట్ చేస్తున్నారు.
నీట్ వాయిదా కోసం అభ్యర్థులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఒక విద్యార్థి #JUSTICEforNEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తూ “దయచేసి NEET UG 2022ని వాయిదా వేయండి. ఇది మా జీవితం, మా భవిష్యత్తు, మా కెరీర్, మా కలల సమస్య. కేవలం 40 రోజుల కోసం మేము ఒక సంవత్సరాన్ని కోల్పోవద్దు. మాకు 40 రోజులు మాత్రమే కావాలి” అంటూ ట్వీట్ చేశాడు.
‘50 రోజుల పాటు NEET UG ని వాయిదా వేయడం వల్ల రాబోయే సెషన్‌కు ఎటువంటి అంతరాయం ఉండదు, ఎందుకంటే ఇది ఫిబ్రవరి 2023 కంటే ముందే ప్రారంభం కాదు. డ్రాపర్లకు సరైన అవకాశం కావాలి’ అంటూ మరో అభ్యర్థి ట్వీట్ చేశాడు.
‘రివిజన్ చేయడానికి సరిపడా సమయం లేదు. మరోపక్క సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాలాంటి చాలా మంది అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పరీక్షల మధ్యే నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారు. మా సమస్యలను ఆలకించండి.’ అంటూ ఇంకో అభ్యర్థి స్పందించాడు.
గతేడాది సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించగా, ఈ ఏడాది నీట్ కోసం ప్రిపేర్ కావడానికి కనీసం 10 నెలల సమయం కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో తాము ఇతర పరీక్షలకు హాజరుకావాల్సి వస్తోందని, దీంతో తాము ఒత్తిడి ఎదుర్కొంటున్నామని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు.
‘NEET-UG 2022 కోసం సిద్ధం కావడంలో ఇబ్బంది ఉంది. NEET సిలబస్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. సిలబస్‌ను పూర్తిగా కవర్ చేయడానికి మిగిలి ఉన్న సమయం సరిపోదు.’ అంటూ ఓ అభ్యర్థి వాపోయాడు.
అయితే నీట్ వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి వస్తున్న అభ్యర్థలను స్వీకరించినట్లు ఎన్టీఏ తెలిపింది. కానీ నీట్ యూజీ-2022కు సంబంధించి పరీక్ష తేదీలో ఎటువంటి మార్పులు ఉండబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. మరోవైపు, నీట్-2022 పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. అయితే ఇది ఫేక్ అని తేలింది. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పులు చేయలేదని పీఐబీ ట్వీట్ చేసింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.