NEET SS 2021: నీట్ SS-2021లో జీరో పర్సంటైల్ స్కోర్ వచ్చిందా..? అయినా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సూపర్ స్పెషాలిటీ (NEET SS) కోర్సుల్లో ప్రవేశానికి అర్హత మార్కుల ప్రమాణాన్ని(qualifying mark criteria) తీసివేసింది. దీంతో సున్నా శాతం కంటే తక్కువ స్కోర్స్ ఉన్న అభ్యర్థులు సైతం మహారాష్ట్రలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిన తరువాత కూడా 748 సూపర్ స్పెషాలిటీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి కనీస మార్కుల అర్హతను కమిటీ గతంలో తొలగించింది. నీట్ ఎస్‌ఎస్ 2021కి హాజరైన అభ్యర్థులు స్కోర్‌తో సంబంధం లేకుండా, ఇప్పుడు ప్రత్యేక మాప్-అప్ అడ్మిషన్ రౌండ్‌లో పాల్గొనవచ్చు.
ఏటేటా సీట్లు మిగిలిపోతుండడంతో జీరో పర్సంటైల్ విద్యార్థులను కూడా అనుమతించాలని ప్రభుత్వం భావించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, మొదటి రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) క్వాలిఫైయింగ్ బార్‌ను 15 శాతం తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నీట్ ఎస్‌ఎస్-2021లో మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక మాప్-అప్ రౌండ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకు ముందే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)ను ఆదేశించింది. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత, 930 సూపర్ స్పెషాలిటీ సీట్లలో 534 డీఎం(DM), ఎంసీహెచ్(MCH) సీట్లు, 396 డీఎన్‌బీ(DNB) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయంపై ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్‌తో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంప్రదించి కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటైల్‌ను తగిన విధంగా తగ్గించి మిగిలిన సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయడానికి ప్రత్యేక మాప్-అప్ రౌండ్‌ను నిర్వహించాలని ఎన్‌ఎంసీకి సూచించింది. ఈమేరకు ఓ లేఖను పంపింది.
కాగా, నీట్ ఎస్ఎస్ -2021పరీక్షలు జనవరి 10న జరగ్గా, ఫలితాలు మూడు వారాల తర్వాత జనవరి 31న ప్రకటించారు. పరీక్షలను మొదట నవంబర్ 2021లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పరీక్ష విధానంలో మార్పుల మధ్య విద్యార్థుల డిమాండ్‌ల కారణంగా వాయిదా వేశారు. పరీక్షల విధానంలో ఆకస్మిక మార్పుపై అభ్యంతరాల నేపథ్యంలో తేదీలను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరడంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ఈ ఏడాది నీట్ పరీక్ష జులై 17న ముగిసింది. దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక తుది ఫలితాలు ఆగస్టు 18 - 31 మధ్య విడుదలవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం నీట్ కట్‌ఆఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NEET, NEET 2021