జాతీయ స్కాలర్‌షిప్ స్కీమ్-2021 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కేంద్ర విద్యా శాఖ. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు (Scholarship) అప్లై చేసుకోవచ్చు. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కుటుంబ ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉండి, ప్రతిభ కలిగిన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు (Scholarship) ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.10 వేలు చొప్పున.. నాలుగు, ఐదు సంవత్సరాలకు ఏడాదికి రూ.20,000 చొప్పున అందిస్తారు. మొత్తం మీద గ్రాడ్యుయేషన్, పీజీ పూర్తయ్యే లోపు రూ.70 వేల వరకు ఉపకార వేతనం పొందుతారు.
ఏటా ఈ పథకం ద్వారా 82,000 స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నారు. 41,000 మంది బాలురు, అంతే మొత్తంలో బాలికలకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తున్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే రెగ్యులర్ కోర్సులు మాత్రమే అభ్యసిస్తూ ఉండాలి. ఇతర స్కాలర్‌షిప్ ప్రయోజనాలు పొందకూడదు. ఈ ఉపకారవేతనం నేరుగా బెనిఫిషియరీ బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తారు.
డిప్లొమా కోర్సులు చదువుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.
కరస్పాండెన్స్ లేదా దూర విద్య ద్వారా చదువుతున్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేయకూడదు.
విద్యార్థులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ యాక్ట్- 1956, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా డెంటల్ కౌన్సిల్ ఇండియా గుర్తించిన కళాశాలలు లేదా విద్యాసంస్థల్లో రెగ్యులర్ కోర్సులు అభ్యసిస్తూ ఉండాలి.
ఇప్పటికే ఏవైనా స్కాలర్‌షిప్‌లు పొందుతున్నా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ పొందుతున్నవారు ఈ స్కీమ్‌కు అనర్హులు.
ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లను రెండు దశల్లో తనిఖీ చేస్తారు. విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థ, దరఖాస్తుదారుని స్టేట్ బోర్డు వివరాలను పరిశీలిస్తారు.
కళాశాల లేదా సంబంధిత స్టేట్ బోర్డు ధ్రువీకరించని అప్లికేషన్ చెల్లుబాటు కాదు.
సంవత్సరానికి ఓ సారి ఈ పథకం కింద వర్తించే స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరిస్తారు. గ్రాడ్యుయేట్ నుంచి పీజీ కోర్సు వరకు ఈ పునరుద్ధరణ అందుబాటులో ఉంటుంది.
ఆసక్తి, ఆర్హత కలిగిన విద్యార్థులు scholarship.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర స్కాలర్‌షిప్ పథకం కింద జాబితా చేసిన కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు 2021 నవంబరు 31లోపు అప్లికేషన్లు పంపాలి. ఈ పథకం గురించి మరింత సమచారం కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Scholarship, Scholarships