TSPSC Paper Leak Case: టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక అలాగే ఆమె భర్త డాక్వా నాయక్ సహా 15 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 100 మందిని విచారించగా..రూ.4 లక్షలను సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రేణుకను ఆమె భర్తను ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించగా..తాజాగా రేణుకకు నాంపల్లి కోర్టులో మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. రేణుకకు బెయిల్ ఇవ్వొద్దన్న సిట్ వాదనతో ఏకీభవించిన కోర్టు రేణుక పిటీషన్ ను కొట్టేసింది. ఇక మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయినా ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను సిట్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా..సోమవారం కోర్టు తీర్పు ఇవ్వనుంది.
ఆ ఇద్దరి ఉద్యోగాలు తొలగింపు..
పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్ గా పని చేస్తుంది. అలాగే ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో ఆఫీస్ లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. కాగా పేపర్ లీక్ కేసులో ప్రధానంగా ప్రవీణ్, రేణుక, రాజశేఖర్, రేణుక భర్త ప్రధాన పాత్ర ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. దీనితో అధికారులు పేపర్ లీక్ లో తొలి వేటు వేశారు.
ఈ ఘటనపై సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే రేణుక పాత్రపై ఆరా తీసిన పోలీసులు ఆమె హస్తం ఉందని తేల్చారు. దీనితో రేణుక పని చేసే స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్సి గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రాస్ కు నివేదిక పంపించారు. ఈ మేరకు నివేదికను పరిశీలించిన ఆయన రేణుకను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆమె భర్త డాక్యా నాయక్ పాత్ర కొంత ఉండడంతో అతడిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలెవరీ రేణుక?
కాగా ఈ కేసులో A1గా ప్రవీణ్, A2గా రాజశేఖర్, A3గా రేణుక నిందితులుగా ఉన్నారు. అయితే ఇందులో ప్రవీణ్, రాజశేఖర్ TSPSCలో పని చేసే వ్యక్తులు కాగా రేణుక బుద్దారం ఎస్సి గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తుంది. అయితే ఆమె సెలవుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ ఏడాదిలో 12 సార్లు ఆమె బడికి సెలవు పెట్టింది. తమ బంధువు చనిపోయాడని ఈనెల 4, 5వ తేదీన రేణుక బడికి సెలవు పెట్టింది. అయితే ఆ తేదిల్లోనే ఈ పేపర్ లీకేజీ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు TSPSC నిర్వహించే ప్రతీ హెగ్జామ్ ముందు కూడా రేణుక సెలవు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. TSPSC బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. వీరిని విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వీరి బాధ్యతలు ఏంటి? ప్రశ్నపత్రాల రూపకల్పనలో వీరి పాత్ర ఎంత వరకు ఉంటుంది? అలాగే కంప్యూటర్లకు సంబంధించి యాక్సెస్ వీరికి ఉంటుందా? లేదా? ఇలా అనేక అంశాలపై వివరాలు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ కొంతమంది సభ్యులను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana, Telangana government jobs, TSPSC, TSPSC Paper Leak