మీకు సంగీతం వినడం ఇష్టమా? గోళ్లు కొరకడం మీ హాబీనా? ఇంటర్నెట్ బ్రౌజింగ్‌పై ఇంట్రస్టా?.. ఇలాంటి విషయాలన్నీ సీవీలు లేదా రెజ్యూమ్‌లలో హాబీలుగా పేర్కొంటున్నారా? ఇలాంటి అలవాట్లను సీవీలలో రాయడంపై మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో పెద్ద చర్చే జరిగింది. శివ్ ఆరూర్ అనే జర్నలిస్టు దీనిపై ఒక చర్చకు తెరతీశారు. ‘మ్యూజిక్ వినడం నా హాబీ అంటూ మీ సీవీలలో రాయకండి’ అంటూ ఆయన అలా ట్వీటారో లేదో.. ఇలాంటి హాబీల గురించి వరుసగా కామెంట్లు వచ్చిపడ్డాయి. దీంతో ఈ చర్చ వైరల్‌గా మారింది. శివ్ ఆరూర్ మరోమాటా అనేశారు... దయచేసి ఇంటర్నెట్ సెర్చింగ్, బ్రౌజింగ్‌ను కూడా హాబీ అంటూ సీవీలలో రాయకండి అని చెప్పేశారు. పాతరోజుల్లో రేడియో వినడం, సంగీతం వినడం.. లాంటి హాబీలను చాలా గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు రోజులు మారాయి. స్నేహితుల స్థానంలో మొబైల్స్ వచ్చాయి. రేడియోలు మ్యూజియాలకు చేరాయి.. ఇక సంగీతం వినడం కూడా ఒక హాబీనా అన్నట్టుగా పరిస్థితి మారింది. అందుకే శివ్ చేసిన ట్వీటుకు అనేకమంది నెటిజన్లు స్పందించారు. నవ్వడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్ళడం, గోళ్ళుకొరకడం లాంటి అలవాట్లను సీవీలు, రెజ్యూమ్‌లలో రాస్తున్నారని నెటిజన్లు చెప్పుకొచ్చారు.
‘నా దగ్గరకు ఈ మధ్య ఒక సీవీ వచ్చింది. అందులో సదరు దరఖాస్తుదారుడు మోడీజీ మన్ కీ బాత్ వినడం నా హాబీ అని రాశారు* అంటూ ఒక నెటిజన్ స్పందించాడు. ‘అయినా మ్యూజిక్ వినడం నా హాబీ అని రాస్తే తప్పేంట’ని ఒకరు ప్రశ్నించారు. ‘అసలు హాబీలకు సమయం ఎక్కడుంది? నేను స్నానం చేస్తూనే టిఫిన్ ఎలా చేయాలా అని తెగ ట్రై చేస్తున్నాను. హాబీలకు టైం లేదు’ అంటూ ఒక నెటిజన్ చమత్కరించాడు.
మన ఉద్యోగానికి లేదా మనల్ని మనం ఆవిష్కరించుకోవడానికి సీవీలు ఒక అద్దంలా ఉండాలంటారు. ఇలాంటి సీవీలలో ఎలాంటి హాబీల గురించి రాయాలనే విషయంపై చాలామందికి స్పష్టత ఉండట్లేదు. చాలామంది స్టీరియో టైప్ సీవీలు రాయడానికి అలవాటు పడిపోయారు. మరి మీరేమంటారు? అసలు మన హాబీలకు ఉద్యోగాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? సోషల్ మీడియాలో వెతికితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమే అంటున్నారు కొందరు విశ్లేషకులు!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Twitter, VIRAL NEWS