తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, టీఆఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. కొంపల్లిలో ఉన్న మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజిని నాక్ (NAAC) బ్లాక్ లిస్టులో పెట్టింది. ఐదు సంవత్సరాల పాటు బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు యాజమాన్యానికి లేఖను పంపింది. డిసెంబర్ 24వ తేదీన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ పరిపాలన అధికారి ఎం. అరుణ్ ఈ లేఖను పంపారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. రీ అసెస్‌మెంట్ కోసం మల్లారెడ్డి కాలేజీ పంపిన పత్రాలను పరిశీలించినప్పుడు తాము అందులో కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను గమనించినట్టు తెలిపారు. ‘మల్లారెడ్డి కాలేజీ సమర్పించిన పత్రాల్లో బీహెచ్ఈఎల్, యష్ టెక్నాలజీస్, ఎయిర్‌టెల్ నుంచి సమర్పించిన సర్టిఫికెట్ల సీల్ (కంపెనీ ముద్ర), సంతకాలు, లెటర్ హెడ్స్ అన్నీ ఫేక్ అని అనుమానం వచ్చింది. మా టీమ్‌లోని డిజిటల్ నిపుణులు కూడా అవి ఫేక్ డాక్యుమెంట్లు అని నిర్ధారించారు. 2020 నవంబర్ 20న నాక్ సమావేశంలో తీర్మానించిన ప్రకారం ఇలాంటి పనులకు పాల్పడే వారి కాలేజీని అక్రిడేషన్ నుంచి బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఆ తీర్మానం ప్రకారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను కూడా అక్రిడేషన్ ప్రాసెస్ విషయంలో ఐదేళ్లు బ్లాక్ లిస్టులో పెడుతున్నాం.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలు విద్యాసంస్థలను నడుపుతున్నారు. అందులో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలను బట్టి నాక్ వాటికి అక్రిడేషన్ ఇస్తూ ఉంటుంది. అయితే, అక్రిడేషన్ కోసం సమర్పించిన పత్రాలు నకిలీవి సృష్టించారని ఇప్పుడు నాక్ ఆరోపించింది. దీనిపై మంత్రి మల్లారెడ్డి ఇంకా స్పందించలేదు.
మరోవైపు ఇటీవల మంత్రి మల్లారెడ్డి మీద కేసు నమోదైంది. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్య ఉన్న తన భూమిని మంత్రి కబ్జా చేశారంటూ శ్యామల అనే మహిళ ఆరోపించారు. అందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ భూమి పట్టాదారు శ్యామల తల్లి. తన రెండు ఆస్పత్రుల మధ్య భూమి కావడంతో తనకు ఆ ల్యాండ్ విక్రయించాలంటూ తనను మల్లారెడ్డి బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అయితే, తాను తమ భూమిని విక్రయించేందుకు నిరాకరించానన్నారు. ఈ క్రమంలో మంత్రికి చెందిన వారు 20 గుంటల భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ కూడా కట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్‌లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. సూరారం లో సర్వే నెంబర్ 115,116,117 లో 20 గుంటల భూమిని మంత్రి మల్లారెడ్డి, కొడుకు భద్రా రెడ్డి మరో ఐదుగురు కబ్జా చేశారంటూ శ్యామల దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన మీద 446, 506 R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Malla Reddy, Telangana, Trs