మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ పదో తరగతి(10th class) పాస్ కాలేదు. కచ్చితంగా పాస్ అవ్వాలని చదివారు. కరోనా కారణంగా అందరిని ప్రభుత్వం ప్రమోట్ చేసింది. కానీ అది ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. అనుకోకుండా.. ఆసక్తిగల వారు పరీక్ష(Exams) రాయొచ్చని ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో.. పరీక్ష రాసి మరీ.. ఫస్ట్ క్లాస్‌లో(First Class) పాస్ అయ్యాడు ఒడిశాకు చెందిన బీజూ జనతాదళ్(BJD) ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వైన్.
సంకల్పం ఉన్న చోట మార్గం కచ్చితంగా ఉంటుంది. సాధించాలనే పట్టుదల ఉంటే వయసు, పరిస్థితులు అడ్డంకే కాదు. ఎప్పుడైనా విజయం పొందవచ్చు. ఈ మాటలను నిజం చేశాడు. ఒడిశాకు చెందిన 49 ఏళ్ల శాసన సభ్యుడు. రాజకీయాల్లో క్రీయాశీలకంగానే ఉంటూ పదో తరగతి పాస్ అయ్యాడు. అందులోనూ మెరిట్ (Merit) సాధించాడు.
ఒడిశాలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) నిర్వహించిన ఆఫ్‌లైన్ హైస్కూల్ సర్టిఫికేట్ (HSC) పరీక్షా ఫలితాలు మంగళవారం ప్రకటించబడ్డాయి. 15, 136 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. బీజు జనతాదళ్ శాసన సభ్యుడు (MLA) పూర్ణ చంద్ర స్వైన్ కూడా ఈ పరీక్ష రాశాడు. ఈ పరీక్ష పాస్ అవ్వడంతో ఆయన స్వైన్ ఆఫ్‌లైన్ స్టేట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ -2021 పొందారు.
మార్కుల వివరాలు..
పూర్ణ చంద్ర స్వైన్ పరీక్షలో చక్కని ప్రతిభ కనబర్చారు. ఆయన అత్యధికంగా పెయింటింగ్‌లో 85 మార్కులు సాధించారు. హోంసైన్స్‌లో 83, ఒడియా భాషలో 67 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 61 మార్కులు సాధించారు. మొత్తం ఈ పరీక్షలో ఆయన 68శాతం మార్కులతో పాస్ ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 500 మార్కులు ఉండే ఈ పరీక్షల్లో ఆయన 340 మార్కులు సాధించి B2 గ్రేడ్ (Grade) పొందారు.
కరోనా కారణంగా ప్రభుత్వం విద్యార్థులను వారి ఇంటర్నల్ మార్కుల (Internal Marks) ద్వారా ప్రమోట్ చేసింది. ఎవరైతే ఈ ఇంటర్నల్ మార్కుల ద్వారా సంతృప్తి చెందలేదో వారికి పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చింది. మళ్లీ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్నవారికి ఆగస్టు 5, 2021న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు బీజు జనతాదళ్ ఎమ్మెల్యే పూర్ణ చంద్ర స్వైన్ హాజరయ్యారు. ఈ పరీక్షల ద్వారా ఆయన తన ప్రతిభను, కష్టాన్ని రుజువు చేసుకొన్నారు. ముఖ్యంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా... ప్రత్యేక ఐసోలేషన్ గదిలో పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించారు. ఇదొక్కటి చాలు ఆయన పట్టుదల తెలియడానికి.
పూర్ణ చంద్ర స్వైన్ ఒడశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బెర్హాంపూర్‌లోని మెడికల్ క్యాంపస్ (Medical Campus) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తన చదువును 9వ తరగతితోనే ఆపేశారు. ఎలాగైనా పదో తరతి పాస్ అవ్వాలని ఆయన సంకల్పించుకొన్నారు. ఆయన వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల మన్ననలు పొందారు. అయినా అనేక ప్రయత్నాల్లో పదో తరగతి పాస్ కాలేక పోయారు. ఈ సారి ఆయన తన కల నెరవేర్చుకొన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.