• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • MINORITY SCHOLARSHIP ISSUE CM CALLS FOR ALL PARTY MEETING ON FRIDAY IN KERALA STATE HERE FULL DETAILS NS GH

Minority Scholarships: మైనారిటీ స్కాలర్‌షిప్ వివాదం... హై కోర్టు తీర్పుపై సీఎం అఖిలపక్ష సమావేశం.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కేరళ రాష్ట్రంలో అమలులో ఉన్న మైనారిటీ స్కాలర్‌షిప్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం సీఎం పినరయి విజయన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
కేరళలో అమల్లో ఉన్న మైనారిటీ స్కాలర్‌షిప్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. దీంతో సమస్యకు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది. మైనారిటీ స్కాలర్‌షిప్‌లలో ప్రభుత్వం ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు మే 28న తీర్పు ఇచ్చింది. పిటిషన్‌లో పేర్కొన్న వివరాలపై దర్యాప్తు చేసిన కోర్టు, స్కాలర్‌షిప్‌లపై 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. మొత్తం మైనారిటీ మెరిట్ స్కాలర్‌షిప్‌లలో 80 శాతం ముస్లింలకు, 20 శాతం క్రైస్తవులకు ఇస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని కేరళ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. రాష్ట్రంలోని నోటిఫైడ్ మైనారిటీ వర్గాలకు సమానంగా, రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ తాజా జనాభా లెక్కల ప్రకారం మెరిట్-కమ్-మీన్ స్కాలర్‌షిప్‌ను అందించాలని హై కోర్టు తీర్పులో పేర్కొంది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో Airtelలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

అయితే.. ఈ తీర్పును క్రిస్టియన్లు స్వాగతిస్తుండగా, ముస్లిం వర్గాలు మాత్రం తమ ప్రయోజనాలను పునరుద్ధరించాలని కోరుతున్నాయి. కోర్టు తీర్పుతో వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నందువల్ల తాజా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

కోర్టు తీర్పులో ఏముంది?
కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.మణి కుమార్, జస్టిస్ షాజీ పి చాలీలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది. మెరిట్-కమ్-మీన్ స్కాలర్‌షిప్‌ల విషయంలో.. ముస్లింలకు 80 శాతం, క్రైస్తవులకు 20 శాతం (లాటిన్ క్యాథలిక్‌లు, క్రైస్తవంలోకి మారినవారు) ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, మైనారిటీల వర్గీకరణను పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. మైనారిటీల వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి, వారిలో ఒక వర్గం ప్రయోజనాలను పరిరక్షించడానికి.. జాతీయ కమిషన్, స్టేట్ కమిషన్‌లకు అర్హత లేదని చెప్పింది.

‘ప్రభుత్వ నిర్ణయం కోర్టుల్లో నిలవదు. అసమానతలను నిర్మూలించడానికి, సమాన అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోని రిజర్వ్డ్ కులాల ఉప-వర్గీకరణ చేయవచ్చు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం సాధించడానికి న్యాయపరమైన పద్ధతిని అవలంబించవచ్చు. కానీ జనాభా నిష్పత్తి ఆధారంగా రాష్ట్రంలోని క్రైస్తవ వర్గానికి అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా, ముస్లిం మైనారిటీ వర్గాలకు 80 శాతం చొప్పున స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు భావిస్తోంది’ అని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

80: 20 నిష్పత్తి అంటే ఏంటి?
2006-08 ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీపీఎం నాయకుడు పలోలి ముహమ్మద్ కుట్టి ఈ విధానాన్ని ప్రకటించారు. మైనారిటీ స్కాలర్‌షిప్‌లపై నియమించిన 11 మంది సభ్యుల కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. కమీటీ సభ్యులు సమర్పించిన ప్రతిపాదనలతో ఈ పథకాన్ని ప్రకటించారు. దేశంలోని ముస్లిం సమాజంలోని సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై జస్టిస్ రజిందర్ సచార్ కమిటీ నివేదిక సిఫారసులను కేరళలో అమలు చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు.

స్కాలర్‌షిప్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ముస్లిం మహిళా విద్యార్థులకు 5000 స్కాలర్‌షిప్‌లను అందించింది. తరువాత ఈ పథకాన్ని లాటిన్ క్యాథలిక్, కన్వర్టెడ్ క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు కూడా అమలు చేసింది. 2015లో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం, ముస్లింలకు 80 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని, వెనుకబడిన క్రైస్తవులకు.. ప్రధానంగా లాటిన్ కాథలిక్, క్రైస్తవంలోకి మారిన దళిత వర్గాలకు 20 శాతం ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయంపై వివాదాలు
ప్రభుత్వ ఉత్తర్వులపై జస్టిన్ పల్లివతుకల్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం.. కేంద్ర ప్రభుత్వం 2006లో ప్రకటించిన స్కాలర్‌షిప్‌ పథకానికి భిన్నంగా ఉందని పిటిషనర్ తెలిపారు. వాస్తవానికి మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మెరిట్-కమ్-మీన్స్ ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో మాత్రం మైనారిటీల్లో ఒక వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రం ప్రకటించిన పథకంలో ఇలాంటి ప్రత్యేక నియమ, నిబంధనలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే మైనారిటీల్లో ముస్లింలు అందరి కంటే వెనుకబడి ఉన్నారని, రాష్ట్రంలో భూమి లేని ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వం వాదించింది. కానీ కోర్టులు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు.

కేరళలో మైనారిటీ హోదా ఎలా ఉంది?
2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 45.27 శాతం మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం జనాభాలో 26.56 శాతం ముస్లింలు, 18.38 శాతం క్రైస్తవులు ఉన్నారు. 3.3 కోట్ల జనాభాలో హిందువులు 54.73 శాతంగా ఉన్నారు. అంటే 45.27 శాతం మైనారిటీలలో 58.67 శాతం ముస్లింలు, 40.6 శాతం క్రైస్తవులు, మిగిలిన 0.73% మంది ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 2.1 కోట్ల జనాభా ఉన్నప్పుడు, 21.1 శాతం క్రైస్తవులు, 19.5 శాతం ముస్లింలతో మైనారిటీ వర్గాల వాటా 40.6 గా ఉంది.

2011 జనాభా లెక్కల ప్రకారం, కేరళలో 6.5 మిలియన్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే రాష్ట్రం స్కాలర్‌షిప్‌లలో లబ్ధిదారులుగా ప్రకటించిన 20 శాతంలో.. కేవలం రెండు క్రిస్టియన్ వర్గాలు మాత్రమే ఉన్నాయి. వీరిలో 13.3 శాతం జనాభా ఉన్న లాటిన్ క్యాథలిక్కులు, 2.6 శాతం దళిత క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులందరిలో ఆరో వంతు మంది.. మూడు ప్రత్యేక చర్చిలకు చెందిన క్యాథలిక్కులుగా ఉన్నారు. సిరో మలబార్, సిరో మలంకర, లాటిన్ క్యాథలిక్ చర్చిలు ఈ విభాగంలో ఉన్నాయి.

మైనారిటీ శాఖను పర్యవేక్షిస్తున్న విజయన్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించిన తరువాత, మైనారిటీ సంక్షేమ శాఖను తనవద్దే ఉంచుకున్నారు సీఎం విజయన్. ఈ విభాగాన్ని నిర్వహించిన మొదటి కేరళ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సాధించారు. ఈ శాఖను ముస్లిం వర్గాలకు కేటాయించడం ఆనవాయితీ. కానీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈసారి మైనారిటీ శాఖను విజయన్ ఇతరులకు కేటాయించలేదు. అయితే మైనారిటీ సంక్షేమ శాఖ తమకు ఏనాడు న్యాయం చేయలేదని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివాదాస్పదమైన 80: 20 నిష్పత్తిని రద్దు చేయాలని ఆ వర్గం వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Keywords
Published by:Nikhil Kumar S
First published: