ఇప్పటికే రెండు తెలుగు(Telugu) రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 03 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే .. పరీక్షల సమయం కూడా దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు(Admit Cards) ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. పదో తరగతి పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనుండగా.. వీటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయం రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు మూడు గంటలు జరిగితే.. సైన్స్ పరీక్ష మాత్రం మూడు గంటల ఇరవై నిమిషాలు జరగనుంది. అయితే పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్స్ మార్చి 24 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలకు కూడా హాల్ టిక్కెట్లు పంపనున్నట్లు తెలిపారు. గతంలోలాగా కాకుండా ఈ సారి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నట విషయం తెలిసిందే. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఈ పరీక్షల కోసం 2,652 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
ఇక.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. పదో తరగతి పరీక్ష ఫలితాలు 100 శాతం వచ్చే విధంగా విద్యాశాఖ ముందడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే గత ఏడాది డిసెంబర్ నెల నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. అల్పాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తోంది. అంతే కాకుండా.. మారిన పరీక్షల విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తూ ఉంది.
ఫైనల్ పరీక్ష ఒత్తిడి భయం పోగొట్టే దిశగా విద్యాశాఖ ఈ రకంగా విద్యార్థులను ముందుగానే సిద్ధం చేస్తుంది. పరీక్ష జరిగే సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. అందు కోసం.. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించింది. సీల్ చేసిన ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసినప్పటి నుంచి తిరిగి జవాబు పత్రాలను ప్యాక్ చేసే ప్రక్రియనంతా సీసీ కెమెరాలలో రికార్డు చేయాలని సూచించింది.
ఇదే సమయంలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు సొంతంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరింది. దాదాపు ఈ ఏడాది 5.1 లక్షలమంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. గతేడాది ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తరహా లీకేజీకి పాల్పడవచ్చని అనుమానంతో.. విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకొచ్చింది. ఈ కెమెరాలను చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Ssc, SSC results, Telangana