టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సైబర్ సెక్యూరిటీని (Cyber Security) కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. మంగళవారం అధికారికంగా ఈ సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. కరోనా(Corona) వైరస్ మహమ్మారి తరువాత డిజిటల్ లెర్నింగ్‌కు ఆదరణ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త కోర్సును (New Course) రూపొందించింది. సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరిగిందని, ఎక్కువ మంది నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించనట్లు టెక్ దిగ్గజం ఓ ప్రకటనలో తెలిపింది. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇదే కావడం విశేషం.
ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలో 1 లక్ష మందికి పైగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. క్లౌడ్ థట్, కీనిగ్, ఆర్పీఎస్, సినర్జిటిక్స్ లెర్నింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందించనుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా లెర్నర్స్‌కు ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు సైబర్ సెక్యూరిటీలో నిపుణులను పరిశ్రమకు అందించనుంది. సులభతరమైన మాడ్యూల్స్‌తో కోర్సు డిజైన్ చేసింది. తద్వారా లెర్నర్స్ సులభంగా ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగ వేటలో సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం
ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సు గురించి మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి మాట్లాడుతూ ‘‘సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను అందరికీ అందుబాటులో తేవాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఫండమెంటల్స్‌లో సర్టిఫికేషన్‌ను ఉచితంగా అందిస్తాం. ఈ సర్టిఫికెట్ ఉద్యోగ వేటలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సైబర్ సెక్యూరిటీలో పనిచేసే అన్ని స్థాయిల్లో ఉన్న అభ్యాసకులకు అనగా కేవలం బిగినర్స్‌కు మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్స్ పర్సన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది.’’ అని చెప్పారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మైక్రోసాఫ్ట్ రెడ్‌మండ్ గ్లోబల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ కోర్సును రూపొందించింది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వివిధ డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో, ఇప్పటికే 30 లక్షల మందికి పైగా కొత్త నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడానికి, ఆసక్తిగల అభ్యాసకులు మైక్రోసాఫ్ట్ ఇండియా స్కిల్లింగ్ ఇనిషియేటివ్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అందులోని సెక్యూరిటీ స్కిల్లింగ్ ట్యాబ్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cyber security, Microsoft, New course, Online classes