ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (Indian Institute Of Management) చేరి ఎంబీఏ (MBA) చేయాలనే కోరిక లక్షలాది మంది విద్యార్థులకు ఉంటుంది. దాని కోసం CAT, XAT, MAT వంటి ఎన్నో ప్రవేశ పరీక్షలతో కుస్తీ పడుతుంటారు. కానీ కొందరి కలలు మాత్రమే సాకారమవుతుంటాయి. అయితే ఈ కల సాకారం కాకపోయినా కొందరు కోటీశ్వరులైపోతారు. ఈ కోవకే చెందుతాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్. ఐఐఎంలో ఎంబీఏ చేసి వ్యాపారంచేయాలనుకున్న ఆయన కల నెరవేరలేదు. కానీ తన తెలివితేటలతో కొత్త రకం బిజినెస్‌తో కోటీశ్వరుడయ్యాడు.వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని లబ్రవ్దా గ్రామానికి చెందిన ప్రఫుల్ బిల్లోర్కు ఐఐఎం అహ్మదాబాద్‌లో మేనేజ్మెంట్ కోర్సు చేయాలని కోరిక. దాని కోసం మూడు సంవత్సరాల పాటు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)కు ప్రిపేర్ అయ్యాడు. కానీ ఎందుకో విజయం అతనికి అందలేదు. కనీసం వ్యాపారిగా అయినా ఎదగాలనే ఆకాంక్షతో ‘MBA చాయ్‌వాలా’ పేరుతో ఒక టీ స్టాల్ ప్రారంభించాడు. క్రమంగా ఎదుగుతూ ఈ వ్యాపారంలో రూ.కోట్లు గడించాడు. ప్రస్తుతం అతడికి దేశ వ్యాప్తంగా 22 ‘ఎంబీఏ చాయ్‌వాలా’ ఔట్లెట్స్ ఉన్నాయి. త్వరలో విదేశాల్లోనూ ఒక చాయ్ స్టాల్ తెరవబోతున్నాడు.
CAT పరీక్షలో మూడోసారి కూడా తప్పడం ప్రఫుల్ భరించలేకపోయాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా నగరాలు తిరిగాడు. మెక్‌డొనాల్డ్స్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. అక్కడే పనిచేస్తూనే చాయ్ అమ్మడం మొదలుపెట్టాడు. అది బాగుందనిపించడంతో చదువు కోసమని చెప్పి తండ్రి నుంచి రూ.10,000 తీసుకున్నాడు. దాంతో చాయ్ దుకాణానికి కావాల్సిన సరుకులన్నీ కొని తన కలల కాలేజీ అహ్మదాబాద్ ఐఐఎం సమీపంలో MBA చాయ్‌వాలా పేరుతో స్టాల్ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతని సంపాదన పెరిగింది. ఉద్యోగం కంటే ఎక్కువ ఆదాయం దీనిద్వారా పొందాడు.
అయితే తండ్రి సలహాతో స్థానికంగా ఒక కాలేజీలో MBAలో చేరాడు ప్రఫుల్. కానీ చదువులో కంటే వ్యాపారంలో తాను ఎక్కువ నేర్చుకుంటున్నట్టు గ్రహించి వారానికే కాలేజీకి రామ్ రామ్ చెప్పాడు. వచ్చి తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో IIM విద్యార్థులు, స్టాప్‌తో పరిచయం బాగా పెరిగింది. వారితో ఇంగ్లిష్‌లో మాట్లాడటం, చాయ్ అమ్మడంలో వైవిధ్యం అతని వ్యాపారానికి కలిసొచ్చింది.
అనంతరం సంపాదన నెలకు రూ.15,000లకు చేరింది. కొన్నాళ్లకు మున్సిపల్ అధికారులు ఆ చాయ్ దుకాణాన్ని తొలగించడంతో ఒక ఆస్పత్రి దగ్గర కొత్త స్టాల్ ఒపెన్ చేశాడు. అక్కడ తన స్టాల్‌కు ‘మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్’ అని పేరు పెట్టాడు. కానీ చాలా మంది ఆ పేరును సరిగ్గా పలకలేకపోవడంతో దాన్ని MBA (మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్) అని మార్చాడు. ఇప్పుడా టీ స్టాల్ కాస్త టీ హౌస్‌గా మారిపోయింది.
వ్యాపారంలోనూ ఎన్నో వ్యూహాలు అమలు చేస్తుంటాడు ప్రఫుల్. ఉద్యోగులు, నిరుద్యోగులకు కనెక్ట్ అయ్యేందుకు తన టీ స్టాల్ ముందు ఒక వైట్ బోర్డు ఏర్పాటు చేశాడు. మీరు ఎలాంటి పనిచేసినా దాన్ని పూర్తి ఇష్టంతో చేయండి, విజయం మీ వెంటే ఉంటుందని చెబుతాడు ఈ యువ వ్యాపారి.
ప్రఫుల్ తండ్రి వ్యవసాయం చేస్తూ ఇప్పటికీ పూజా సామగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. ప్రఫుల్ చిన్నప్పటి నుంచే తెలివైనవాడు. అందరూ నడిచే బాటలో నడవటానికి అతను ఇష్టపడడు. పిల్లలు జీవితంలో ఎదిగేందుకు వారి ఆలోచనలను అర్థం చేసుకొని సహకరించాలని కొడుకు గురించి మురిసిపోతూ తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.