IIT Courses: రానున్న విద్యాసంవత్సరం నుంచి ఐఐటీల్లో కొత్త కోర్సులు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అయిన ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ)లు కొత్తగా కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను ప్రారంభించాయి. కేవలం విద్యార్థుల కోసమే కాకుండా నిపుణుల కోసం కూడా కొన్ని కొత్త కోర్సులను ప్రారంభించాయి.

  • Share this:
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అయిన ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ)లు కొత్తగా కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను ప్రారంభించాయి. కేవలం విద్యార్థుల కోసమే కాకుండా నిపుణుల కోసం కూడా కొన్ని కొత్త కోర్సులను ప్రారంభించాయి. ఇవి 2021–22 అకడమిక్ ఇయర్​ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హత ప్రమాణాలు, కోర్సు వ్యవధి, దరఖాస్తు వివరాలను తెలుసుకుందాం.
IGNOU PG Diploma Course: సరికొత్త పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించిన ఇగ్నో... అప్లై చేయండిలా

మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఎంపిపి), ఐఐటి ఢిల్లీ
ఐఐటి ఢిల్లీ 2021–22 విద్యా సంవత్సరం నుంచి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఎంపిపి) పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ (ఎస్‌టిఐ) విభాగాలపై అనేక కోర్సును డిజైన్​ చేశారు. ఎంబీబీఎస్​, బీఏ ఎల్​ఎల్​బీ (హానర్స్​), బీఆర్క్​, బీటెక్​, బీఎస్సీ (అగ్రికల్చర్​) బీవీఎస్సీ లేదా సమానమైన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులకు అర్హులు. వీరితో పాటు ఎంఏ, ఎంఎస్సి, ఎంఫిల్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి / ఎంఏ, ఎంటెక్ వంటి పోస్ట్​ గ్రాడ్యుయేట్​ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ఎంటెక్, ఎండిజైన్​ ప్రోగ్రామ్, ఐఐటీ హైదరాబాద్
ఐఐటి హైదరాబాద్ ఆగస్టు 2021 నుంచి కొత్తగా ఏడు ఆన్‌లైన్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది. ఏడు ఆన్‌లైన్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లలో ఇండస్ట్రియల్​ మెటలర్జీ, ఈవీ టెక్నాలజీ, కంప్యుటేషనల్ మెకానిక్స్, ఇంటిగ్రేటెడ్ కంప్యూటేషనల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ (సిఎస్‌పి), పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ పవర్​ సిస్టమ్స్​ (PEPS), మైక్రోఎలక్ట్రానిక్స్, వీఎల్​ఎస్​ఐ వంటివి చేర్చింది. ఇక, వీటితో పాటు వృత్తి నిపుణులకు ఆన్‌లైన్ ఎండిజైన్​ ప్రోగ్రామ్​ను కూడా అందించనుంది.

ఎంటెక్​ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఐఐటీ రూర్కీ
ఐఐటి రూర్కీ కొత్తగా ప్రారంభించిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగం 2021–22 అకాడెమిక్ సెషన్ నుంచి రెండు కొత్త కోర్సులను ప్రారంభించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్​లో ఎంటెక్​ ప్రోగ్రామ్​ను అందించనుంది. ఏదైనా ఇంజనీరింగ్ కోర్సులో బీఈ / బీటెక్ / ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ-మాస్టర్స్ ప్రోగ్రామ్స్​, ఐఐటి కాన్పూర్
కరోనా మహమ్మారి కారణంగా ఆన్​లైన్​ లెర్నింగ్​కు ప్రాధాన్యత పెరిగింది. దీనిలో భాగంగా ఐఐటి కాన్పూర్ కొత్తగా నాలుగు ఈ-మాస్టర్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్, సైబర్‌సెక్యూరిటీ, పవర్ సెక్టార్ రెగ్యులేషన్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, కమోడిటీ మార్కెట్స్ అండ్​ రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి ప్రోగ్రామ్​లను ప్రారంభించనుంది. ఈ కోర్సులకు దరఖాస్తు ప్రక్రియ జులైలో ప్రారంభం కానుంది. వీటి తరగతులు ఆగస్టు మధ్యలో ప్రారంభమవుతాయి. కోర్సు అర్హత, ఫీజు, అడ్మిషన్​ వివరాలను ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మాస్టర్ ఇన్ డిజైన్, మాస్టర్ ఇన్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్, ఐఐటి రూర్కీ

ఐఐటి రూర్కీ కొత్తగా డిపార్ట్​మెంట్ ఆఫ్ డిజైన్ (డిఓడి)ని స్థాపించింది. దీని కింద కొత్తగా మాస్టర్స్ ఇన్ డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్), మాస్టర్స్ ఇన్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్ (ఎంఐఎం) అనే రెండు కొత్త పీజీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త కోర్సులు ప్రారంభం కానున్నాయి. మాస్టర్స్ ఇన్ డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్) కోర్సు విద్యార్థులను డిజైన్, ప్రోటోటైపింగ్, డిజైన్ థింకింగ్, ప్రొడక్ట్-హ్యూమన్ ఇంటర్ఫేస్ మొదలైన వాటిలో నిపుణులుగా తీర్చిదిద్దుతుంది.

ఎంటెక్​ ఇన్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ, ఐఐటీ ఢిల్లీ
ఐఐటి ఢిల్లీ 2021–22 అకడమిక్ సెషన్ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) ప్రోగ్రామ్​ను ప్రారంభించనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవ్‌ట్రెయిన్, ఛార్జర్లు, ఛార్జింగ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్​, బ్యాటరీ మేనేజ్​మెంట్​ సిస్టమ్​, రీయూజెబిలిటీ ఆఫ్​ ఎనర్జీ స్టోరేజ్​ ఎలిమెంట్స్ తదితర అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఈఈఈ) లేదా మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంఈ) లేదా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (పిఐ) బ్రాంచుల్లో నాలుగేళ్ల బీఈ/బీటెక్​ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

బీటెక్ ఇన్ ఎనర్జీ ఇంజనీరింగ్, ఐఐటి ఢిల్లీ
ఐఐటి ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఎనర్జీ స్టడీస్ (సిఈఎస్) ను ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంగా మార్చనున్నారు. దీని విస్తరణలో భాగంగా కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. ఈ కొత్త విభాగం 2021–2022 అకడమిక్​ సెషన్​ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్​లో బీటెక్​ కోర్సును అందించనుంది. JEE (అడ్వాన్స్‌డ్) అర్హత సాధించిన 40 మంది విద్యార్థులతో దీన్ని ప్రారంభించనున్నారు.

అప్లైడ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్‌లో పిజి ప్రోగ్రామ్, ఐఐటి మద్రాస్
ఐఐటీ మద్రాసులోని రాబర్ట్ బాష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఎఐ (ఆర్‌బిసిడిఎస్‌ఎఐ) అప్లైడ్ డేటా సైన్స్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్‌లో 12 నెలల పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభించింది. టాలెంట్‌స్ప్రింట్ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్​ను అందించనున్నారు. ఆగష్టు 2021లో ఈ కోర్సు ప్రారంభం కానుంది. వృత్తి నిపుణుల్లో డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఫుల్​ స్టాక్ డెవలప్​మెంట్​లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్, ఐఐటి మండి
ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), మండి కొత్తగా ఫుల్​ స్టాక్ డెవలప్​మెంట్​లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సును తీర్చి దిద్దింది. పూర్తి-స్టాక్ డెవలపర్లను తీర్చిదిద్దడానికి మొత్తం ఏడు నెలల పాటు ఈ కోర్సును అందించనుంది.
Published by:Nikhil Kumar S
First published: