వైసీపీ(YCP) ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. దశల వారీగా టీచర్ పోస్టులను(Teacher Jobs) భర్తీ చేసినట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ప్లస్ 2 ఖాళీల భర్తీ తర్వాత డీఎస్సీ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మరో వైపు లీకేజీ ఆరోపణలు వచ్చిన టీచర్లను తహసీల్దార్ ఆఫీసుల్లో(Office) ఉంచాలన్న సర్క్యూలర్ వెనక్కి తీసుకున్నామని తెలిపారు. టీచర్లపై తమ ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదన్నారు. ముఖ్యమంత్రి(Chief Minister) జగన్(CM Jagan) ఆదేశాలతో ప్రస్తుతం ఉండాల్సిన టీచర్ పోస్టులు ఎన్ని అనే విషయంపై నివేదిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు.
ముఖ్యమంత్రికి నివేదికను వివరించి.. ఆ తర్వాత ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జులై, ఆగస్టులో కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. ఇటీవల ఉపాధ్యాయుల వయోరిమితి పెంచేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ విద్య(సవరణ) బిల్లు 2023ని మంత్రి బొత్స సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఎన్నికల మందు డీఎస్సీ ప్రకటించి.. ఖాళీలను భర్తీ చేయలేదని మంత్రి బొత్స తెలిపారు. వాటిని తాము పూర్తి చేశామని పేర్కొన్నారు.
తెలంగాణలో..
ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలపగా.. ఈ పోస్టుల భర్తీలో మరిత జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 20వేల ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. కానీ.. వీటి కంటే ముందు గురుకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. 11 వేల పోస్టులకు అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా.. ప్రకటనలు మాత్రం రావడం లేదు.
మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణం చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం వీటి భర్తీపై బోర్డు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్షల మంది నిరుద్యోగులకు నిరీక్షణ తప్పడం లేదు. గురుకుల పోస్టుల భర్తీ తర్వాత డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం ఏదో ఒక ప్రకటన వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Ap jobs, Career and Courses, JOBS, Telangana government jobs