గతంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా (Food Delivery Agent) పనిచేసిన ఓ యువకుడు ఇప్పుడు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఇది అంత సులువేమీ కాలేదు. ఈ ఘనత వెనుక అతని కష్టం ఉంది. అతని పేరు షేక్ అబ్దుల్ సత్తార్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం (IT Job) చేస్తున్నాడు. డెలివరీ ఏజెంట్ నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వరకు ఇదంతా ఎలా సాధించాడో లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో (Linkedin Post) వివరించాడు. తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అతని తండ్రి కాంట్రాక్ట్ వర్కర్. కుటుంబ ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. అందుకే తను కూడా పనిచేయాలనుకున్నాడు. ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారాడు.
షేక్ అబ్దుల్ సత్తార్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం ప్రకారం అతనిది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చదివాడు. శ్రీ గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఫుడ్ పార్శిల్స్ డెలివరీ చేసేవాడినని సత్తార్ వివరించాడు.
Rs 2000 Notes: రూ.2,000 నోట్లు దొరకవా? ఆర్‌బీఐ ఏం చెబుతోందంటే
మొదట్లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేయడానికి సిగ్గుపడేవాడినని, కానీ ఆ తర్వాత చాలా విషయాలు నేర్చున్నానని తెలిపాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ఉద్యోగం ఉపయోగపడిందని సత్తార్ వివరించాడు. స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలకు పనిచేశాడు. ఓలా, ఊబెర్, ర్యాపిడో లాంటి సంస్థలకు కూడా సేవలు అందించాడు.
ఓ స్నేహితుడి సలహాతో కోడింగ్ నేర్చుకున్నాడు. ఉదయం కోడింగ్ క్లాసులకు అటెండ్ అవుతూ, సాయంత్రం నుంచి ఆరు గంటల పాటు డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. వచ్చిన సంపాదనలో కొంత తన ఖర్చులకు దాచుకొని మిగతా మొత్తాన్ని ఇంటి ఖర్చుల కోసం ఇచ్చేవాడు. తనకు నేర్చుకున్న స్కిల్స్‌తో వెబ్ అప్లికేషన్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. కొత్తకొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశాడు.
Bank Account: ఖాతాదారులకు అలర్ట్... ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి మే 29 నుంచి కొత్త రూల్స్
కాస్త అనుభవం వచ్చిన తర్వాత టెక్ కంపెనీల్లో ఉద్యోగాలకు అప్లై చేశాడు. ప్రోబ్ ఇన్ఫర్మేషన్ అనే సంస్థలో ఉద్యోగానికి కూడా అప్లై చేశాడు. ఆ ఉద్యోగం తనకు వచ్చింది. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సేవలు అందిస్తున్నాడు.
సంపాదించిన ప్రతీ రూపాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన చోటి నుంచి కొన్ని నెలల జీతంతో తల్లిదండ్రుల అప్పులు తీర్చే స్థాయికి వచ్చానని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరించాడు సత్తార్. లింక్డ్‌ఇన్‌లో అతని నెట్వర్క్‌లో ఉన్నవారంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సత్తార్ లింక్డ్‌ఇన్ పోస్టుకు ఈ వార్త రాసే సమయానికి 69,222 లైక్స్, రియాక్షన్స్, 2,127 కామెంట్స్, 409 షేర్స్ రావడం విశేషం.
ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే, అందుకు తగ్గట్టుగా కష్టపడుతూ, కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటే ఇలాంటి విజయాలు సొంతం అవుతాయని షేక్ అబ్దుల్ సత్తార్ సక్సెస్ స్టోరీ నిరూపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food delivery, JOBS, Linkedin, Software, Success story, Visakhapatnam