ఇంజనీరింగ్ (Engineering) కోర్సుల ఫీజులకు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTU-H). క్యాంపస్, కాన్‌స్టిట్యూట్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులను విద్యాసంస్థ పెంచింది. రెగ్యులర్ బీటెక్(B.Tech) కోర్సుల ఫీజును ఏడాదికి రూ.35,000 నుంచి రూ.50,000కు పెంచుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (EC) ఆమోదించిన కొత్త ఫీజు హైదరాబాద్‌లోని జేఎన్ టీయూ-హెచ్ క్యాంపస్‌తోపాటు జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్, రాజన్న సిరిసిల్ల, వనపర్తిలలోని కాన్‌స్టిట్యూట్ కళాశాలలు ఆఫర్ చేస్తున్న అన్ని రకాల బీటెక్ కోర్సులకు వర్తిస్తుంది.
కేవలం బీటెక్ కోర్సులే కాకుండా, ఎంటెక్ రెగ్యులర్ కోర్సుల ఫీజును సెమిస్టర్‌కు రూ. 15,000 నుంచి రూ. 30,000కు పెంచినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ ఎంటెక్ కోర్సులకు ఏడాదికి రూ.1లక్ష వసూలు చేయనున్నారు. ఫీజు పెంపునకు వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల ఫీజును ఈ విద్యా సంవత్సరానికి సవరించకూడదని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించడంతో ఫీజు పెంపు అమలుపై అడ్మినిస్ట్రేషన్ క్యాచ్-22 పరిస్థితి నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
జేఎన్‌టీయూ-హెచ్ క్యాంపస్, కాన్‌స్టిట్యూట్ కాలేజీలు సవరించిన ఫీజును ఈ సంవత్సరం లేదా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలా వద్దా అనే దానిపై ఒక వారంలో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నందున, ఫీజు పెంపు విద్యార్థులందరిపై ప్రభావం చూపకపోవచ్చు.
నిబంధనల ప్రకారం టీఎస్ ఎంసెట్ (TS EAMCET)లో 10,000 లోపు ర్యాంకు సాధించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయనున్నారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) విద్యార్థులకు కూడా వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయనున్నారు. కాగా, టీఎస్ ఎంసెట్‌లో 10,000 కంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా కనీసం రూ. 35,000 మంజూరు చేయనున్నారు. మిగిలిన ఫీజును విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీ కోసమే ఈ కరెంట్ అఫైర్స్..
మరోవైపు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థుల కోసం కొత్త కోర్సులను ప్రవేశపెడుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అకడమిక్ ఇయర్ నుంచి 11 అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అండ్ మెషిన్ లెర్నింగ్(ML)పై మూడు సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటివరకు AI అండ్ MLలను రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో ఇంజనీరింగ్ కోర్సుగా అందిస్తున్నాయి. ఈ కోర్సుకు విద్యార్థులలో భారీ డిమాండ్ ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కోర్సును 11 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి బీఎస్సీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Engineering course, JNTUH, Telangana News