హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(JNTU-H) స్పెషల్ సర్టిఫికేట్ కోర్సు (Certificate Course)లను ఆఫర్ చేస్తోంది. యూనివర్సిటీ (University)కి చెందిన స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బ్లాక్ చెయిన్, డేటా సైన్స్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ అండ్ డెవొప్స్‌పై ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సులను అందించనుంది. వీటితో సాంకేతిక పరమైన ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌ను మెరుగుపర్చుకోడానికి అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://doa.jntuh.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జులై 23గా నిర్ణయించారు. అయితే రూ. 500 ఆలస్య రుసుముతో జులై 30 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. కాగా, సర్టిఫికేషన్ కోర్సులు ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి.
* అర్హత ప్రమాణాలు
ఏదైనా విభాగంలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినవారు లేదా ప్రస్తుతం అభ్యసిస్తున్న వారు ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై అవగాహన ఉండాలి. అడ్మిషన్ కమిటీ మూల్యాంకనం చేసిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానం ప్రకారం ప్రవేశాలను కల్పించనున్నారు. రెగ్యులర్ తరగతుల మాదిరిగా యూనివర్సిటీ ప్రతి థియరీ, ల్యాబ్ సెషన్‌కు 75 శాతం హాజరును తప్పనిసరి చేసింది. థియరీ, ప్రాక్టికల్ సెషన్‌లు రెండూ ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. అసైన్‌మెంట్ ద్వారా థియరీ/ల్యాబ్ సెషన్‌లకు 40 శాతం వెయిటేజీ కాగా, చివరి పరీక్షలకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది.
తరగతులు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు జరగనున్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ తమ షెడ్యూల్స్ నుంచి విరామం తీసుకోకుండా ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు ఈ టైమింగ్ సౌలభ్యాన్ని కల్పించారు. జేఎన్‌టీయూ-హైదరాబాద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన ఫ్యాకల్టీ, పరిశ్రమల నిపుణులు ఈ కోర్సుల్లో బోధించనున్నారు.
ప్రస్తుతం డేటా సైన్స్, క్లౌడ్ అండ్ డెవొప్స్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ రంగాలకు డిమాండ్ ఉంది. దీంతో ఈ రంగాలనే కెరీర్‌లుగా మార్చుకునే అవకాశాన్ని జేఎన్‌టీయూ కల్పిస్తుంది. వివిధ స్ట్రీమ్‌లకు చెందిన విద్యార్థులకు సరిపోయే విధంగా సర్టిఫికేట్ కోర్సులను జేఎన్‌టీయూ డిజైన్ చేసింది. అభ్యర్థుల ఫౌండేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారి కెరీర్‌లో పురోగతిని సాధించడానికి ఈ కోర్సులు దోహదపడతాయి. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, వీటికి కేటాయించిన క్రెడిట్‌లను అభ్యర్థులు బదిలీ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. కాగా, ప్రస్తుతం, జేఎన్‌టీయూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. రాబోయే రోజుల్లో మరికొన్ని సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Certificate, JNTUH, JOBS