దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. అత్యంత కఠినమైన జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో ఇది ఒకటి. జేఈఈ మెయిన్ -2023 షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ఇటీవల విడుదల చేసింది. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరగనున్నాయి. పరీక్షలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో జేఈఈ అభ్యర్థులు ప్రిపరేషన్‌పై మరింత దృష్టిసారించాల్సి ఉంది. జేఈఈ మెయిన్‌లో బెస్ట్ స్కోర్ సాధించడానికి గత ఏడాది టాపర్స్ కొన్ని ప్రిపరేషన్ టిప్స్ పంచుకున్నారు. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
ధీరజ్ కురుకుంద
తెలంగాణకు చెందిన ఈ టాపర్, జేఈఈ మెయిన్ -2022లో 100 పర్సంటైల్ సాధించిన 24 మందిలో ఒకరు. సెల్ఫ్-స్టడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని, ప్రతి రోజు 8 గంటలు అందుకు కేటాయించినట్లు ధీరజ్ చెప్పుకొచ్చాడు. జేఈఈ అభ్యర్థుల కోసం కొన్ని చిట్కాలను పంచుకున్నాడు. పరీక్షల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండడానికి ప్రయత్నించాలని సూచించాడు. ఎక్కువగా సెల్ఫ్ స్టడీపై ఫోకస్ చేయాలని, అప్పడప్పుడు బ్రేక్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించాడు. టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌పై ఎఫర్ట్స్ పెట్టాలని సూచిస్తున్నాడు.
ఓజస్ మహేశ్వరి
జేఈఈ మెయిన్ 2022లో పీడబ్ల్యూడీ కేటగిరీలో 99.994 పర్సంటైల్ స్కోర్‌తో మొదటి ర్యాంక్ సాధించాడు ఓజస్. సెల్ఫ్-స్టడీ, రివిజన్ రోజుకు 12 నుంచి 13 గంటల సమయం కేటాయించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే అలసట రాకుండా ఉండటానికి రాత్రిపూట 7 గంటల నిద్ర ఉండేలా చూసుకున్నాడు. పేపర్ సాల్వింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా మాక్ టెస్ట్‌లకు ప్రాక్టీస్ చేసినట్లు ఓజస్ చెప్పుకొచ్చాడు.
స్నేహ పరీఖ్
అస్సాం రాష్ట్రానికి చెందిన స్నేహా పరీఖ్ జేఈఈ మెయిన్-2022లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. 300కు 300 మార్కులు రావడంతో 100 పర్సంటైల్ సాధించింది. ‘ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ముందు రోజు చెప్పిన పాఠాలను మరుసటి రోజు తప్పనిసరిగా రివైజ్ చేశాను. ప్రతి రోజు 12:30 గంటల వరకు రెగ్యులర్ క్లాస్‌లకు హాజరయ్యాను. సెల్ఫ్ స్టడీపై ఎక్కువగా దృష్టి సారించాను. అసైన్‌మెంట్‌లను పూర్తి చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ల కోసం లోతుగా అధ్యయనం చేయడానికి కోచింగ్ సెంటర్‌లోనే ఉంటూ ప్రిపరేషన్ కొనసాగించాను.’ అని స్నేహ చెప్పుకొచ్చింది.
జేఈఈ మెయిన్స్ కోసం అదనపు పుస్తకాలను స్టడీ చేయలేదని, ఎక్కువగా NCERT బుక్స్, సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌పై ఆధారపడినట్లు ఆమె తెలిపింది. మాక్ టెస్ట్‌లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, అన్ని టాపిక్స్‌ను బ్యాలెన్స్‌డ్‌గా ప్రిపేర్ కావడం ముఖ్యమని సూచించింది.
పార్థ్ భరద్వాజ్
జేఈఈ మెయిన్-2022లో పార్థ్ భరద్వాజ్ ఆలిండియా మూడో ర్యాంక్ సాధించాడు. మునుపటి సంవత్సరం పేపర్స్‌పై ఎక్కువగా దృష్టిసారించినట్లు ఈ టాపర్ చెప్పుకొచ్చాడు. ఎగ్జామ్ -అట్మెంట్ స్ట్రాటజీ కోసం సాధ్యమయ్యే అన్ని ఆప్షన్లను పరీక్షించానని, తనకు బాగా సరిపోయేదాన్ని ఎంపిక చేసుకున్నట్లు భరద్వాజ్ పేర్కొన్నాడు.
అనికేత్ చటోపాధ్యాయ
ఈ టాపర్ జేఈఈ మెయిన్-2022లో 100 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. ‘నేను వరుసగా రెండు గంటల పాటు ప్రిపేర్ కొనసాగించి, ఆపై అరగంట విరామం తీసుకున్నాను. ప్రతి సబ్జెక్టుకు సమాన టైమ్ కేటాయించాను. ప్రిపరేషన్ సమయంలో సంగీతం కూడా విన్నాను. రిలాక్స్ కావడానికి ఇది సహాయపడింది. తోటివారితో కలిసి ప్రిపరేషన్ కొనసాగించడం కూడా బాగా కలిసొచ్చింది.’ అని అనికేత్ వివరించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JEE Main 2023, JOBS