JEE Main 2023: ఇండియాలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. అందుకే దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో (Engineering Colleges) ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(JEE)కు పోటీ ఎక్కువ. డిసెంబర్ 11న జేఈఈ మెయిన్స్ 2023 (JEE Main) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించే అవకాశం ఉంది. 2023 జనవరి, ఏప్రిల్‌లో రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంజినీరింగ్ మొదటి విడత పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కోరుతున్నారు.
* నోటిఫికేషన్ ఆలస్యమైతే ఇబ్బందులు
మొదటి విడత జనవరిలో నిర్వహించని పక్షంలో ఫిబ్రవరి, మార్చిలో జరిపేందుకు కొన్ని అడ్డంకులున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు మొదలవుతాయి. ఇతర రాష్ట్రాల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చిలో ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. వాస్తవంగా నోటిఫికేషన్‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు మధ్య కనీసం 40 రోజుల వ్యవధి ఉండాలి. ఆ ప్రకారం ఈ వారంలో ప్రకటన జారీ చేస్తేనే జనవరి నెలాఖరులో పరీక్ష జరిపేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ జనవరిలో నిర్వహించలేని పక్షంలో ఏప్రిల్, మే నెలల్లో జరుపుతామంటూ అధికారికంగా ప్రకటిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Government Jobs: ఇంటర్, డిగ్రీ, పీజీతో 6,990 ఉద్యోగాలు .. నోటిఫికేషన్ పూర్తి వివరాలిలా..
* డిసెంబర్లోనే మొదటి సెషన్ రిజిస్ట్రేషన్
2023 జనవరిలో జరిగే మొదటి సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ నెలలోని మొదటి భాగంలో ప్రారంభమవుతుందని సమాచారం. జేఈఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఇంటర్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించి, నిర్ణయించిన దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంటాయి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 1147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
* ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా
JEE మెయిన్ 2023 కంప్యూటర్ బేస్ట్ టెస్ట్(CBT) మోడ్‌లో జరుగుతుంది. రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రారంభమవుతుంది. JEE మెయిన్ 2023 పేపర్లో మ్యాథ్స్(30), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి మొత్తం 90 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. అయితే BArch (పేపర్ 2A) 82 మార్కులను ఉంటుంది. B Planning (పేపర్ 2B) 105 మార్కులకు రాయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం JEE మెయిన్ జూన్ 20 నుంచి 29, జులై 21, 30 తేదీలలో రెండు సెషన్లలో జరిగింది.
* కనీస మార్కుల నిబంధనలు అమలు?
జేఈఈ ప్రవేశాలు పొందాలంటే జేఈఈలో ర్యాంకుతోపాటు ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 65 శాతం, ఇతరులు 75 శాతం మార్కులు పొందటం తప్పనిసరి. కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాల్లో ఇంటర్ లేదా 12వ తరగతి వార్షిక పరీక్షలు జరగలేదు. ఈ నేపథ్యంలో 2020 నుంచి 2022 వరకు ఆ నిబంధనలు అమలు చేయలేదు. ఇంటర్ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎస్ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, కళాశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నందున జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్-2023కు మళ్లీ పాత నిబంధనలను అమలు చేస్తారని సమాచారం. జేఈఈ మెయిన్‌ను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అడ్వాన్స్డ్ నిర్వహించే ఐఐటీలు ఈ దిశగా చర్యలు తీసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాయని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, JEE Main 2023