దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)ను ఏటా నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది 2023కు సంబంధించిన జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్ష రెండు సెషన్లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ 2023 సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. దీంతో జేఈఈ ఔత్సాహిక అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ఎన్టీఏకు పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్‌ను త్వరగా ప్రకటించాలని కొందరు, జేఈఈ మెయిన్ సెషన్ -1ను ఏప్రిల్‌లో నిర్వహించాలని మరికొందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇతర పరీక్షలతో క్లాష్
జేఈఈ మెయిన్ సెషన్-1ను జనవరిలో నిర్వహించడం వల్ల ఇతర పరీక్షలతో క్లాష్ వస్తుందని అభ్యర్థులు చెబుతున్నారు. అంతేకాకుండా సిలబస్ పూర్తిగా చదవడానికి, రివిజన్ చేయడానికి సమయం సరిపోదని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్ వేదికగా #jeemainsinapril అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
JEE Main-2023: త్వరలో జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్.. ఎగ్జామ్ ప్యాట్రన్ వివరాలు ఇవే..
ట్విట్టర్లో విజ్ఞప్తులు
ట్విట్టర్ వేదికగా జేఈఈ అభ్యర్థులు స్పందిస్తున్నారు. దయచేసి జనవరిలో జేఈఈ మెయిన్స్ నిర్వహించవద్దని, ఎందుకంటే ప్రాక్టీస్, సిలబస్ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. ఒక వేళ జనవరిలో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తే రివిజన్‌కు తగినంత సమయం లభించదని ఓ ఔత్సాహిక అభ్యర్థి ట్వీట్ చేశాడు. మరొకరు చేసిన ట్వీట్లో.. దయచేసి జేఈఈ మెయిన్ సెషన్ -1ను ఏప్రిల్‌లో నిర్వహించండి, లేకపోతే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ కావడానికి సమయం ఉండదు, దీంతో డ్రాప్ కావాల్సి వస్తుందని పేర్కొన్నాడు.
ఎగ్జామ్ ప్యాట్రన్
గతేడాది మాదిరి, జేఈఈ మెయిన్-2023 పేపర్ ప్యాట్రన్ రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్ -A మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. ఇక, సెక్షన్-Bలో న్యూమరికల్ వాల్యుగా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు ఉంటాయి.సెక్షన్ A తప్పనిసరి. అన్ని ప్రశ్నలను ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. అయితే, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేయనున్నారు. సెక్షన్ Bలో అభ్యర్థులు ఇచ్చిన 10 ప్రశ్నలలో ఏవైనా ఐదు ప్రశ్నలను ప్రయత్నించాలి. సెక్షన్-Bలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
ఈసారి దరఖాస్తులు పెరిగే అవకాశం?
జేఈఈ మెయిన్-2023 షెడ్యూల్ వచ్చే వారంలో విడుదల కావచ్చు. ప్రస్తుత అకడమిక్ ఇయర్‌కు సంబంధించి అనేక బోర్డులు ప్రాక్టికల్స్‌ను జనవరిలో నిర్వహించనున్నాయి. 2022లో జూన్, జూలై ప్రయత్నాలతో సహా మొత్తంగా 10,26,799 మంది అభ్యర్థులు JEE మెయిన్ 2022 కోసం నమోదు చేసుకున్నారు. అయితే 9,05,590 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మొత్తం 24 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించి ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 2.5 లక్షలలోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థులు IIT ప్రవేశ పరీక్ష - JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. ఈ ఏడాది ఎక్కవ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Jee mains, JOBS, National Testing Agency