దేశంలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించే ఇన్‌స్టిట్యూట్‌లుగా ఐఐటీలకు గుర్తింపు ఉంది. పదుల సంఖ్యలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివేందుకు లక్షలాది మంది యువత పోటీపడతారు. ఇంటర్ లేదా 12వ తరగతి పూర్తి చేసిన భారతీయ విద్యార్థులతో పాటు విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు సైతం ఐఐటీలో చదివేందుకు ఆసక్తి చూపుతారు. వారి కోసం జేఈఈ నిర్వాహకులు కొత్త నిబంధన తీసుకొచ్చారు.
భారతీయ విద్యార్థుల్లాగే ఫీజు
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIO) విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఫీజు మార్చారు. ఓసీఐ, పీఐవో విద్యార్థులు భారతీయ విద్యార్థుల్లాగే ఫీజు చెల్లిస్తే సరిపోతుందని నిర్ణయించారు. మార్చి నెల ప్రారంభంలో జాయింట్ అడ్మిషన్ బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కేటగిరీలు వారీగా భారతీయ విద్యార్థులు, ఓసీఐ లేదా పీఐవో విద్యార్థుల ఫీజులో తేడా ఉండేది. ఇకపై ఒకేలా చెల్లించేలా నిర్ణయించారు. మిగిలిన అర్హతలు అన్నీ ముందుగా ప్రకటించిన విధంగానే ఉంటాయని బోర్డు వివరించింది.
నేరుగా జేఈఈ అడ్వాన్స్
ఓసీఐ, పీఐవో విద్యార్థులు జీఈఈ మెయిన్ పరీక్ష రాయకుండా నేరుగా అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు. అయితే ఈ నిర్ణయం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన ఓసీఐ, పీఐవో అభ్యర్థులు జనరల్, జనరల్-పర్సన్ విత్ డిజెబిలిటీ (PwD) కేటగిరీల కింద ఓపెన్ కేటగిరీ సీట్లకు పోటీ పడేందుకు అర్హులని ఈ మేరకు ప్రకటనలో తెలిపారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన మహిళా అభ్యర్థులు జనరల్ పర్సన్ విత్ డిజెబిలిటీ
(PwD), జనరల్ కేటగిరీలలోని ఓపెన్ ఫిమేల్ సూపర్‌న్యూమరీ సీట్లకు కూడా అర్హులని ఆ ప్రకటనలో వివరించారు. జేఈఈ పరీక్షకు సంబంధించి వయసు అర్హత, ఎన్నిసార్లు రాయవచ్చు, పూర్తి ఫీజు వివరాలు, ఎగ్జామ్ పేట్రన్ ఇతర వివరాలకు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో మే 8లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్ టికెట్లు మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటాయి. జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి నిర్వహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Jee advanced, JOBS