జాతీయ విద్యా విధానం(NPE)పై కేంద్రం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. 2030 నాటికి పాఠశాల ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కోసం డ్యూయల్ మేజర్ బ్యాచిలర్స్ డిగ్రీల ఆఫర్‌తో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)ను తప్పనిసరి చేస్తూ 2021లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రస్తుతం ITEP పైలట్ ప్రాజెక్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-24 అకడమిక్ ఇయర్ నుంచి ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. అర్హత ఉన్న అభ్యర్థులు మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఎంపిక చేసిన 50 మల్టీ డిసిప్లినరీ సంస్థలు ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి చొరవ తీసుకోనున్నాయి. ఈ ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్ ప్రక్రియను నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) ద్వారా చేపట్టనున్నారు. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించనుంది.
కోర్సుకు సంబంధించిన పాఠ్యాంశాలను కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(NCTE) రూపొందించింది. ఒక విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు డిగ్రీని పొందేందుకు వీలు కల్పించే విధంగా చరిత్ర, గణితం, సైన్స్, కళలు, ఆర్థిక శాస్త్రం, వాణిజ్యం వంటి సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ITEP అత్యాధునిక బోధనా శాస్త్రాన్ని అందించడమే కాకుండా, బాల్య సంరక్షణ విద్య(ECCE), పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రం (FLN), సమగ్ర విద్య, భారతదేశం సంప్రదాయాలు, విలువలు/నైతికత/కళలపై అవగాహన కల్పించనున్నారు.
సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత టీచింగ్‌ని వృత్తిగా ఎంచుకునే విద్యార్థులందరికీ ఐటీఈపీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం B.Ed చేయాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది. అయితే ఐటీఈపీ ద్వారా కేవలం నాలుగేళ్లలో పూర్తిచేయవచ్చు. తద్వారా విద్యార్థులకు ఒక సంవత్సరం కలిసిరానుంది. జాతీయ విద్యా విధానం -2020 ప్రధాన లక్ష్యాలను నెరవేర్చడంలో నాలుగేళ్ల ITEP ప్రోగ్రామ్ ఒక మైలురాయి వంటిది. మొత్తం ఉపాధ్యాయ విద్యా రంగంలో సమూల మార్పులకు ఈ కోర్సు చుక్కాని వలె పనిచేస్తుంది కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.
మరోవైపు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (IPM)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 2022-23 అకడమిక్ ఇయర్ నుంచి ఈ కొత్త ప్రోగ్రామ్ ప్రవేశపెడుతున్నట్లు ఐఐఎఫ్‌టీ తెలిపింది.
కాకినాడ(ఏపీ)లోని జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)లో ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభం కానుంది. ఇందు కోసం అక్కడ ఐఐఎఫ్‌టీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తులను మే 21లోపు సమర్పించాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ కోసం అర్హత పరీక్ష జూన్ 2, 2022 నిర్వహించనున్నట్లు ఐఐఎఫ్‌టీ తెలిపింది. ఐఐఎం(IIM)ఇండోర్, నిర్వహించే IPMAT- 2022 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను తయారు చేసి అడ్మిషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Teacher, Teacher jobs