భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) ఒకటి. ఈ దళం ప్రధానంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరింపునకు, అలాగే శాంతిభద్రతల పరిరక్షణ విధులతో పాటు హిమాలయ సరిహద్దుల్లోనూ గస్తీ కాస్తుంది. తాజాగా ఐటీబీపీ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్స్‌ను ITBP అధికారిక వెబ్సైట్ itbpolice.nic.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా, నవంబర్ 23తో ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 24 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంపిక ప్రక్రియ
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్లో అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రెండో దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నిర్వహించనున్నారు.
అర్హత ప్రమాణాలు
- పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో ఫార్మసీలో డిప్లొమా చేసి ఉండాలి.
-1948 ఫార్మసీ చట్టం ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మసిస్ట్‌లుగా రిజిస్టర్ అయి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
ఐటీబీపీలో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలోని పురుష అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
జీతభత్యాలు
పే మ్యాట్రిక్స్ లెవల్ 5 ప్రకారం.. ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల నెల జీతం రూ. 29,200 నుంచి రూ 92,300 (7వ CPC ప్రకారం) మధ్య ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో లేదా విదేశాల్లో ఎక్కడైనా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ITBP చట్టం-1992, రూల్స్- 1994 ప్రకారం.. అపాయింట్మెంట్ సమయంలో అమల్లో ఉన్న ఏవైనా ఇతర నియమాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.
1962లో ఐటీబీపీ ఏర్పాటు
1962లో చైనాతో యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం హిమాలయ సరిహద్దులను కాపాడేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో 1962 అక్టోబర్ 24 నాలుగు బెటాలియన్లతో ITBP దళం ఏర్పాటైంది. ప్రారంభంలో ఈ ఫోర్స్‌లో వివిధ యూనిట్ల నుంచి 1,472 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈ దళంలో 56 బెటాలియన్లు, 176 సరిహద్దు అవుట్‌పోస్టులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.