ఐటీ ఉద్యోగార్థులకు పండగే.. భారీగా నియామకాలు చేపట్టిన సంస్థలు..

IT Jobs: భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టుల కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సంస్థలు కొత్తగా దాదాపు 85 వేల మందిని నియమించుకున్నాయి.

news18-telugu
Updated: August 28, 2019, 10:30 AM IST
ఐటీ ఉద్యోగార్థులకు పండగే.. భారీగా నియామకాలు చేపట్టిన సంస్థలు..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భవిష్యత్తులో రానున్న ప్రాజెక్టుల కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సంస్థలు కొత్తగా దాదాపు 85 వేల మందిని నియమించుకున్నాయి. గత ఆరేళ్లలో ఒక త్రైమాసికంలో కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఈ స్థాయిలో ఉండడం రికార్డు అని ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్ఏ తెలిపింది. హెచ్‌1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడంతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆయా దేశాల్లోనే కంపెనీలు ఆ దేశాలకు చెందిన నిపుణులను తీసుకుంటున్నాయి. దీంతో భారీ మొత్తంలో కంపెనీలు ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత ఆరేళ్లలో ఉద్యోగ నియామకాలను పరిశీలిస్తే.. 2012-13 తొలి త్రైమాసికంలో పరిశ్రమ కొత్తగా దాదాపు 50 వేల మందిని, 2013-14 చివరి త్రైమాసికానికి ఇది దాదాపు 38 వేలకు తగ్గిందని, 2015-16 తొలి త్రైమాసికంలో 70 వేల మంది స్థాయికి చేరిందని, ఆ తర్వాత 2017-18 తొలి త్రైమాసికంలో 10 వేల మందికి పడిపోయిందని సీఎల్‌ఎస్ఏ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌ 12,356 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. గత ఐదేళ్లలో ఒక త్రైమాసికంలో కంపెనీ ఇచ్చిన అత్యధిక ఉద్యోగాలు ఇవే కావడం విశేషం. 30వేల మందికి పైగా ఫ్రెషర్లకు జాయినింగ్‌ లెటర్లు ఇచ్చామని.. ఇందులో తొలి త్రైమాసికంలో 40 శాతం మంది కంపెనీలో చేరారని టీసీఎస్‌ వెల్లడించింది. అదే విధంగా తొలి త్రైమాసికంలో విప్రో 3,425 మంది నిపుణులను చేర్చుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 5,935 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ 8వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ.. బయటకు వెళ్లిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. నికరంగా ఇచ్చిన ఉద్యోగాలు 908 మాత్రమే. డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్న వారిని ఐటీ కంపెనీలు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
First published: August 28, 2019, 10:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading