ఇంజినీరింగ్ విద్యార్థులకు కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ హైవే ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను చేపట్టనుంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITలు)లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రెషర్స్, సివిల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 15.
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బీటెక్ లేదా ఎంటెక్ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్-ఫీల్డ్ ట్రైనింగ్ పొందనున్నారు. ఈ ఇంటర్న్‌షిప్ మూడు నెలల పాటు జరగనుంది. ఈ సమయంలో అభ్యర్థులను హైవే ప్రాజెక్టుల కాంట్రాక్టర్, కన్సల్టెంట్‌కు కేటాయిస్తారు.
అర్హత ప్రమాణాలు
బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ఎంటెక్ చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే బీటెక్, ఎంటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. గత సెమిస్టర్‌లలో 7.0 లేదా 70 శాతం మార్కులతో CGPA సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం
నేషనల్ హైవేస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి AICTE పోర్టల్ aicte-india.orgను సందర్శించాలి. ఇంటర్న్‌షిప్ లింక్ పై క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని పూరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టైఫండ్ వివరాలు
కేంద్ర రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది. వివిధ రకాల నేషనల్ హైవేస్ ప్రాజెక్టులను చేపట్టే ఏజెన్సీలు NHAI, NHIDCL వంటి వాటికి అభ్యర్థులను కేటాయించనున్నారు. ఇంటర్న్‌షిప్ కోసం ఎంపికైన బీటెక్ విద్యార్థులకు నెలకు రూ. 10,000, ఎంటెక్ విద్యార్థులు రూ. 15,000 స్టైఫండ్ ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్న్‌ల వసతి, రవాణా ఖర్చులను కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ భరించనుంది. ఇంటర్న్ షిప్ విజయంతంగా పూర్తి చేసిన తరువాత అభ్యర్థులకు సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఇందుకు తుది మూల్యాంకనంలో అభ్యర్థి కనీసం 75 మార్కులను స్కోర్ చేయాలి.
సర్టిఫికెట్ ఎలా పొందాలంటే...
విద్యార్థులు ఒక మిడ్-టర్మ్, చివరి-టర్మ్ మూల్యాంకనానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లెర్నింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌పై విద్యార్థుల ప్రెజెంటేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌పై విద్యార్థులు ఇచ్చే రిపోర్ట్ తోపాటు ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడర్లు ఇచ్చే జనరల్ అసెస్‌మెంట్, అటెండెన్స్ ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. సర్టిఫికేట్ పొందడానికి అర్హత సాధించాలంటే విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 75 మార్కులు సాధించాలి.
మార్కుల కేటాయింపు వివరాలు
ఇంటర్న్‌షిప్ లెర్నింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌పై ప్రజెంటేషన్ కోసం 20 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్న్‌షిప్ లెర్నింగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌పై నివేదిక సమర్పించడం కోసం 40 మార్కులు, కాంట్రాక్టర్/రాయితీదారు ప్రాజెక్ట్ మేనేజర్ ద్వారా సాధారణ అంచనాకు 10 మార్కులు ఇవ్వనున్నారు. AE/IE/PMC టీమ్ లీడర్ ద్వారా సాధారణ అంచనా కోసం 10 మార్కులు, NHAI/NHIDCL/BRO/స్టేట్ PWDకి సంబంధించిన PD/EE ద్వారా జనరల్ అసెస్‌మెంట్‌కు10 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న అభ్యర్థుల హాజరుకు 10 మార్కులు కేటాయిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Career and Courses, Engineering course, JOBS