Inter New Course: ఇంటర్‌లో AI, రోబోటిక్స్ సహా 9 కొత్త కోర్సులు... పూర్తి వివరాలు

ఇంటర్‌లో AI, రోబోటిక్స్ సహా 9 కొత్త కోర్సులు... పూర్తి వివరాలు (ప్రతీకాత్మక చిత్రం)

Intermediate New Course: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు టెక్నాలజీ కోర్సులపై ఫోకస్ పెట్టింది. విద్యార్థులకు కొత్త కోర్సులు రాబోతున్నాయి. అవేంటో... పూర్తి వివరాల్ని అర్థమయ్యేలా తెలుసుకుందాం.

 • Share this:
  టెన్త్ అవ్వగానే ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇలా రొటీన్ కోర్సులు కాకుండా... ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా ఉండే కోర్సులు చెయ్యాలనుకుంటున్నారా... ఐతే... తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయం తెలుసుకుంటే మంచిది. భవిష్యత్తు మొత్తం టెక్నాలజీ కోర్సులదే అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే అలాంటి కోర్సులకు డిమాండ్ బాగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని... టెక్నాలజీపై స్టూడెంట్స్‌కి నాలెడ్జ్ పెంచేందుకు ఇంటర్ బోర్డు... కొన్ని షార్ట్ టెర్మ్ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. ఇవి మొత్తం 9 కోర్సులు ఉన్నాయి. వీటిని వేసవి సెలవులు అయిపోయాక.. 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతోంది. వీటికి సంబంధించి ఆల్రెడీ సిలబస్ రెడీ చేసేసింది.

  ఈ కోర్సుల సిలబస్‌ను... జనవర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (JNTUH) ప్రొఫెసర్లకు ఇస్తుంది. వారు దీన్ని మొత్తం పరిశీలిస్తారు. ఎలా ఉందో చూస్తారు. ఏమైనా మార్పులు చేయాలంటే చెయ్యమని చెబుతారు. వేసవి సెలవుల సమయంలో... ఈ మార్పులు జరిగిపోతాయి. సరిగ్గా కాలేజీలు తెరవగానే... కొత్త కోర్సులు పలకరిస్తాయి. అయితే ఇవి సంవత్సరమంతా చదివే కోర్సులు కావు. కొంతకాలమే ఉంటాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన పెరుగుతుంది. ఉద్యోగాలు పొందేందుకు వీలవుతుంది. స్వల్పకాలిక కోర్సు నచ్చితే... అప్పుడు పూర్తి స్థాయిలో అదే కోర్సును చదివి... అందులోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవచ్చు. అదే ఇంటర్ బోర్డు ఆలోచన.

  కొత్త కోర్సుల లిస్టు
  1. కృత్రిమ మేధ (Artificial Intelligence)
  2. మెషిన్‌ లెర్నింగ్‌
  3. రోబోటిక్స్‌
  4. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ
  5. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ
  6. కోడింగ్‌
  7. ఎంబెడ్‌ సిస్టమ్‌
  8. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌
  9. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌

  చూశారుగా వీటిలో నచ్చిన కోర్సును మీరు చదువుకోవచ్చు. కచ్చితంగా కెరీర్‌కి ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు. ఒక్కో కోర్సూ 3 నెలల నుంచి 9 నెలల దాకా ఉంటుంది. కోర్సుల్లో 60 శాతం ప్రాక్టికల్స్‌, 40 శాతం థియరీ ఉంటుంది. ఫీజు తక్కువగానే తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఇంటర్‌ విద్యార్థులు ఏ గ్రూపు చదువుతున్నా... అదనంగా ఈ కోర్సులు కూడా చేయవచ్చని తెలిపారు. ముందుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో వీటిని ప్రవేశపెడతారు. మున్ముందు ఇవే కోర్సులు పూర్తి స్థాయి కోర్సులుగా మారనున్నాయి. ప్రస్తుతం ఒకేషనల్‌లో 40 రకాల కోర్సులను చెబుతున్నారు.

  ఇది కూడా చదవండి: సోలార్ పవర్ బ్యాటరీ కారు తయారుచేసిన రైతు... ఒకసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. వెళ్తుంది

  ఈ 9 కోర్సులూ విద్యార్థులకు తెలిసి ఉండాలని... టెక్నాలజీ కంపెనీలు కోరుతున్నాయి. టెక్నికల్‌గా మన దేశ విద్యార్థులు మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కోర్సులకు ఫీజులు తక్కువే కాబట్టి... పేద విద్యార్థులు కూడా వీటిని నేర్చుకొని... భవిష్యత్తుల్లో మంచి ఉద్యోగాలు పొందేందుకు వీలవ్వనుంది.
  Published by:Krishna Kumar N
  First published: