ఇంటర్మీడియట్(Intermediate) మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ముఖ్య సూచన. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జూలై 17 వరకు తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు(Advanced Supplementary), ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు(Improvement Exam) రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు(Exam Fee) చెల్లించేందుకు గడువు జూలై 8తో ముగిసింది. అయితే ఈ వారం రోజులుగా వర్షాలు పడటంతో .. విద్యార్థులు ఫీజు కట్టడంలో ఇబ్బందులు ఎదురైన వారికి మరో అవకాశం కల్పించారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు . తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో రెండు రోజులు అవకాశం ఇచ్చారు. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో రూ. 200 ఫైన్ తో ఫీజు చెల్లించవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులకు.. ప్రాక్టికల్ పరీక్షలో తప్పిన వారికి.. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూలై 22న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయి.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు గానూ మొత్తం 3,48,171 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1,34,329 మంది, సెకండ్ ఇయర్ సప్లమెంటరీ విద్యార్థులు 1,13,267 మంది ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు 99,667 మంది ఉండగా, సెకండ్ ఇయర్‌లో కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. బ్రిడ్జికోర్సుకు చెందిన వారు మరో 893 మంది ఉన్నారు. పరీక్ష ఫీజుకు మరో రెండు రోజుల సమయం బోర్డు అధికారులు ఇవ్వడంతో ఆ దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఓపెన్ లో ప్రేవేశాలు ఇలా..
2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్ లో చేరడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి విద్యార్హత లేని వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి, ఇంటర్‌లో చేరడానికి జులై 18 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టాస్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Intermediate, Intermediate exams, JOBS, Telangana jobs