Government College: ఆదర్శమంటే ఇదే.. కొడుకును ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేసిన ఉన్నతాధికారి

ఆదర్శంగా నిలుస్తున్న అధికారి

Inspirational officer: చాలామంది ఉన్నతాధికారులు మాటలు ఒకలా ఉంటే.. చేతలు మరోలా ఉంటాయి. కానీ ఓ ఉన్నతాధికారి మాత్రం.. చెప్పినట్టే చేశారు.. తన కొడుకును ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేసి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 • Share this:
  Inspiration: సాధరణంగా ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకున్నవారు తమ పిల్లలను ఏ కార్పొరేట్ స్కూల్ కో, కాలేజీకో పంపిస్తారు. ఐఐటీ, జేఈఈ, జిప్మర్, ఎంసెట్, ఏఐఈఈఈ అంటూ రకరకాల కోచింగ్ లు ఇస్తామంటూ.. ఊదరగొట్టే కార్పొరేట్ కాలేజీలలోనే జాయిన్ చేస్తారు. మధ్య తరగతి ప్రజలు కూడా అప్పులు చేసి.. కొందరైతే ఆస్తులు అమ్మ మరీ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనే ఆశతో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో జాయిన్ చేస్తారు. అసలు తమ పిల్లలు చదవగలరా? ఫీజులు కట్టగలరా? అన్నది ఏమాత్రం కూడా ఆలోచించరు. ఇలాంటి రోజుల్లో కూడా ఆయన తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన ఎవరంటే..? విజయనగరం జిల్లా (Vizianagaram District) పార్వతీపురం ఐటీడీఏ పీఓ (Parvathipuram ITDA PO) కూర్మనాథ్.. గతంలో జాయింట్ కలెక్టర్ (Jiont Collector) గా, ప్రస్తుతం ఐటీడీఏ పీఓగా ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నారు. అయినా తన కుమారుడిని ప్రభుత్వ కళాశాల (Government College)లో చేర్పించి పది మందికి ఆదర్శమయ్యారు. పీఓ కూర్మనాథ్ (PO kurmanath) తన కుమారుడు త్రివిక్రమ్ ను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (Intermediate 1st Year) కోసం సీతానగరం మండలం జోగింపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేసారు.

  కుటుంబ పోషణ కోసం రోజంతా కష్టపడే కూలీ సైతం తమ పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించాలని తపన పడుతున్న రోజులివి. గతంతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుబాటులో ఉంటుందని తెలిసినా.. మనలో చాలా మంది కనీసం అటువైపు చూడం. ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధాయుల్లోనూ అధికశాతం మందిది ఇదే తీరు.

  పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాధ్ తీరే వేరు. ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించేలా.. తన తోటి అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలిచేలా కూర్మనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో విజయనగరం జిల్లా కేంద్రంలో ఉంటూ జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో.. తన కుమారుడు ఆర్‌.త్రివిక్రమ్‌ ను విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న కస్పా ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో సోమవారం ఉదయం చేర్పించారు. అయితే పార్వతీపురం ఐటీడీఏ పీవోగా వెళ్లాక పార్వతీపురం పట్టణంలోని కేపీఎం మున్సిపల్‌ హైస్కూల్‌లో పదో తరగతి పూర్తి చేయించారు.

  ఇక ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి వచ్చిన తన కొడుకును.. గురువారం సీతానగరం మండలం జోగింపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో చేర్పించారు. తానే స్వయంగా అడ్మిషన్ ఫామ్ ను నింపి.. తన కొడుకును జాయిన్ చేసారు. ఆయనే స్వయంగా తన కొడుకును క్లాస్ రూమ్ కి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు.

  తన కొడుకుతో పాటు అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగిగా అందరికీ ఏ్దదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాలా పాటిస్తున్నారు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌. తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

  ఇటీవల నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వ నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేర్పించానని ఆయన అంటున్నారు.

  తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత స్ధానంలో ఉన్నానని, ప్రభుత్వ కళాశాల విద్యపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచేందుకే... రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని.. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వి నియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు తన కొడుకుని ప్రభుత్వ బడులు, కాలేజీలో చేర్పించినట్టు పీఓ కూర్మనాథ్‌ వెల్లడించారు.
  Published by:Nagesh Paina
  First published: