Home /News /jobs /

INFOSYS WILL INVEST RS 2500 CRORE IN TELANGANA PROVIDES EMPLOYMENT TO NEARLY 20000 IT PROFESSIONALS NS

IT Jobs: తెలంగాణలో Infosys రూ. 2500 కోట్ల పెట్టుబడులు.. 20 వేల మందికి ఉద్యోగావకాశాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad IT Jobs: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో 20 వేల మందికి ఉపాధి లభించనుంది.

    కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలైనా.. ఐటీ రంగంపై మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయినా.. లాక్ డౌన్ సమయంలో వర్చువల్ గా ఐటీ కంపెనీలు నూతన నియామకాలు సైతం చేపట్టాయి. అనేక మంది ఐటీ ఉద్యోగులు ఈ కరోనా సమయంలోనే నూతన కంపెనీలకు కూడా మారారు. భారీగా ఆఫర్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో హైదరాబాద్ లోని పోచారం క్యాంపస్ ను విస్తరించనుంది ఇన్ఫోసిస్. దీంతో దాదాపు 20 వేల మందికి నూతనంగా ఉద్యోగవకాశాలు రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

    ఈ నిధులతో సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ బ్లాక్ లు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం, ఇతర సదుపాయల కోసం బిల్డింగ్, మల్టిలెవల్ కార్ పార్కింగ్ ను 329.84 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలను తీసుకుంది. ఘటకేసర్ మండలంలోని పోచారం క్యాంపస్ 117.24 ఎకరాల్లో ఇప్పటికే విస్తరించి ఉంది.

    ఈ తాజా విస్తరణ ద్వారా మరో నాలుగు ఐటీ డవలప్మెంట్ బ్లాకులను కంపెనీ నిర్మించనుంది. ఒక్కో టవర్ 15 ఫ్లోర్ల వరకు నిర్మించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే కంపెనీ పర్యావరణ అనుమతులను కోరింది. ప్రస్తుతం పోచారం క్యాంపస్ లో 22, 430 మంది పని చేస్తున్నారు. ప్రస్తుత విస్తరణ ద్వారా 19, 270 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలగనుంది. పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad, Information Technology, Infosys, Telangana

    తదుపరి వార్తలు