నూతన జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం దేశ ఎడ్యుకేషన్ వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకురానున్నారు. ఇందులో భాగంగా భారత యూనివర్సిటీలు విదేశాల్లో, విదేశీ యూనివర్సిటీలు భారత్ (India)లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. విదేశాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి భారతీయ యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెల్లడించనున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రధానంగా ఆఫ్రికా, గల్ఫ్ దేశాలతో పాటు థాయ్‌లాండ్, వియత్నాంలో భారత వర్సిటీలు క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులతో కూడిన లొకేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది.
యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. విదేశాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్న భారతీయ యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయన్నారు. క్యాంపస్‌ల ఏర్పాటుకు దేశాలను సెలక్ట్ చేసుకోవడంలో యూజీసీ అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు. వివిధ ఆఫ్రికన్ దేశాలు భారతీయ యూనివర్సిటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయని జగదీష్ కుమార్ పేర్కొన్నారు.
* యూజీసీ ఛైర్మన్ ఏమన్నారంటే..
ఇప్పటికే ఐఐటీలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థలు ఐఐటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఐఐటీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఐఐటీలు తమ క్యాంపస్‌లను విదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ఐఐటీలు విదేశాల్లో క్యాంపస్‌ల ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. మిడిల్-ఈస్ట్, దక్షిణాసియా దేశాలు కూడా క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఐఐటీలను కోరాయి.
నేపాల్, శ్రీలంక, టాంజానియా దేశాల్లో క్యాంపస్‌ల ఏర్పాటును ఐఐటీ మద్రాస్ పరిశీలిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో క్యాంపస్‌ను ప్రారంభించాలని ఐఐటీ ఢిల్లీ యోచిస్తోంది. ఈజిప్ట్, థాయిలాండ్, మలేషియా, యూకేలో సైతం ఐఐటీల క్యాంపస్‌లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : ఇంటర్ తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. ఈ రంగాల్లో మంచి ఉద్యోగాలు..
* డ్రాఫ్ట్ నిబంధనలకు లోబడి అడ్మిషన్స్, ఫీజులు
భారత్‌లో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు ముసాయిదా నిబంధనలను యూజీసీ గత నెలలో వెల్లడించింది. విదేశీ యూనివర్సిటీల అడ్మిషన్ ప్రాసెస్, ఫీజు షెడ్యూల్స్ వంటి అంశాలు ఈ నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ విద్యాసంస్థల క్యాంపస్‌లను మనదేశంలో ఏర్పాటుపై యూజీసీ తీసుకొచ్చిన డ్రాఫ్ట్‌పై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చలు జరిగాయి.
‘మనదేశంలో యూనివర్సిటీ పర్యావరణ వ్యవస్థ భారీ స్థాయిలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో క్యాంపస్‌ల ఏర్పాటుకు ఈ యూనివర్సిటీలకు భారీ అవకాశాలు ఉన్నాయి. థాయ్‌లాండ్, వియత్నాం, గల్ఫ్ దేశాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఈ దేశాల్లో క్యాంపస్‌ల ఏర్పాటుకు కఠినమైన నిబంధనలు కూడా లేవు.’ అని జగదీష్ కుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, UGC