Indian Navy : సాయుధ దళాల్లో పని చేయాలని కోరుకునే వారికి మరో అవకాశం లభించింది. సాయుధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నిపథ్(Agipath) పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియన్ నేవీ(Indian Navy).. సీనియర్ సెకండరీ రిక్రూట్(SSR), మెట్రిక్ రిక్రూట్(MR) ద్వారా అగ్నివీర్స్(Agniveers)ను నియమించుకోవడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నోటిఫికేషన్ మరో వారం రోజులలోపు రిలీజ్ కానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ www.joinindiannavy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 17గా నిర్ణయించే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తం పోస్టులు
నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇండియన్ నేవీ SSR రిక్రూట్మెంట్ కోసం 1400 ఖాళీలు, ఇండియన్ నేవీ MR రిక్రూట్మెంట్ కోసం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత ప్రమాణాలు
సీనియర్ సెకండరీ రిక్రూట్(SSR): సీనియర్ సెకండరీ రిక్రూట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్ (12వ తరగతి) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు గణితం, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో కనీసం ఒక సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
మెట్రిక్ రిక్రూట్(MR): మెట్రిక్ రిక్రూట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. 2002 మే 1 నుంచి 2005 అక్టోబర్ 31 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే ఈ రెండు కేటగిరి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ
ముందుగా ఇండియన్ నేవీ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ఒకవేళ ఇప్పటికే మీరు రిజిస్టర్ కాకపోయింటే, హోమ్ పేజీలో రిజిస్టర్ ట్యాబ్‌పై క్లిక్ చేసి ఇమెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఇమెయిల్ అడ్రస్‌తో లాగిన్ అయి, Current Opportunitiesను అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అప్లై చేయడానికి అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి, అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు రూ.550 చెల్లించాలి. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ
ఇండియన్ నేవీలో అగ్నివీర్స్ ఎంపిక కోసం దరఖాస్తుదారులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఇనిషియల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తరువాత ఫైనల్‌గా రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Agniveer, Career and Courses, Indian Navy, JOBS