Mulugu : 'బాలిక చదువు దేశానికి వెలుగు'. ఆడపిల్లలకు చదువు చెప్పించాలేగాని వారు అద్భుతాలు సృష్టిస్తారు. అందుకు ఉదాహరణే కొరగట్ల ధరహాసిని. తెలంగాణ విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు ప్రభంజనం సృష్టించారు. అబ్బాయిలను మించి అమ్మాయిలు ర్యాంకులు సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో గిరిజన బాలిక కొరగట్ల ధరహాసిని మొదటి స్టేట్ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హన్మకొండ సిగ్మా జూనియర్ కాలేజ్‌లో చదువుతున్న కొరగట్ల ధరహాసిని, బైపీసీ గ్రూప్‌లో 440కి గాను 437 మార్కులతోస్టేట్ మొదటి ర్యాంకు సాధించింది. తమ కూతురు బైపీసీలో స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల తండ్రి రామ్మూర్తి, తల్లి ధరహాసిని ఉబ్బితబ్బిబవుతున్నారు.
తల్లిదండ్రుల్లో వెల్లివిరిసిన ఆనందం:ఈసందర్భంగా వారు న్యూస్ 18 ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ 'తమ కూతురు చాలా కష్టపడి చదువుతుందని, డాక్టర్ సీటు సాధించాలని పట్టుదలతో బైపీసీలో చేరినట్లు' తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఇప్పలగడ్డ అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న రామ్మూర్తి కుటుంబం, పిల్లల చదువుకోసమే వారిని హాస్టల్లో ఉంచి ప్రత్యేకంగా చదివిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన బాలిక స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల ఇప్పలగడ్డ గ్రామస్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎంబీబీఎస్ సీటే లక్ష్యం: జిల్లాలో సరైన సదుపాయాలు లేకపోవడంతో హనుమకొండలోని సిగ్మా జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ బైపీసీలో చేరినట్లు ధరహాసిని తెలిపింది. స్టేట్ ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్న ధరహాసిని..భవిష్యత్తులో డాక్టర్ చదవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుని చదువుతున్నట్టు తెలిపింది.
తనకు స్టేట్ ర్యాంక్ రావడం వెనుక, తలిదండ్రులు, కుటుంబ సభ్యుల త్యాగం, కృషి ఎంతో ఉందని, ముఖ్యంగా చదువులో ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ ఘనత సాధించినట్లు ధరహాసిని చెప్పుకొచ్చింది. బైపీసీ గ్రూప్ తీసుకున్న తనకు సబ్జెక్టు విషయంలో లెక్చరర్స్ అందరూ సపోర్టుగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నానని ధరహాసిని తెలిపింది. ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టర్ అవ్వాలని, నిరుపేద గిరిజనులకు ఉచిత వైద్యం అందించాలనే జీవిత లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ధరహాసిని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Mulugu, Telangana Inter Results, TS Inter Results 2022, Warangal