రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మరో మూడు రోజులపాటు అంటే శనివారం (జూలై 16) వరకు ప్రభుత్వ, ప్రైవేట్(Private) అనే తేడా లేకుండా అన్ని విద్యాసంస్థలకు సెలవులు(Holidays) పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రకటించింది. గత వారం రోజులుగా తెలంగాణలో ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం(Government) సెలవులు ప్రకటించింది. 17 జూలై రోజున ఆదివారం కావడంతో మళ్లీ విద్యాసంస్థలు తిరిగి సోమవారం (జూలై 18) రోజున తిరిగి పున:ప్రారంభం కానున్నాయి. ఇలా రేపటి నుంచి దాదాపు నాలుగు రోజుల వరకు సెలవులు ప్రకటించినట్లు అయింది. దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
జూలై 11, 12, 13వ తారీఖున స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. కానీ.. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ బాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గత వారం రోజుల నుంచి కూడా.. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలు అన్నీ..చెరువులను తలపిస్తున్నాయి. ఇక పట్టణాల్లో అయితే ఏ కాలనీలో చూసినా.. వరదలే కనిపిస్తున్నాయి. జిల్లాల్లో ఉన్న రిజర్వాయర్లు నిండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలు అన్నీ నీటితో మునిగిపోయాయి. ముందస్తుగా ఆ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో విద్యాసంస్థలను నడపడం సరికాదని భావించిన విద్యాశాఖ అధికారులు మరో మూడు రోజులు సెలవులను ప్రకటించారు.
అంతే కాకుండా.. రేపటి(గురువారం) నుంచి జరగవలసిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. వీటితో పాటు.. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే అన్ని రకాల పరీక్షలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. పరీక్షల షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.