ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినా వాటన్నింటినీ వదిలేసి పరుల శ్రేయస్సు కోసమే పాటుపడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇతరులకు సహాయపడటంలోనే వీరికి అసలైన సంతృప్తి దొరుకుతుంది. ఐఐటీయన్స్ అనిర్బన్ నంది (Anirban Nandy), పౌలమి నంది (Poulami Nandy) కూడా ఈ కోవకు చెందినవారే. వీరిద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur)లో రూరల్ డెవలప్‌మెంట్ (Rural Development)లో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు. తాజాగా వీరి కాళ్ల ముందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పోస్ట్-డాక్టరేట్ చదివే ఆఫర్ వచ్చింది. అయితే వారు ఆ ఆఫర్‌ను నిస్సంకోచంగా రిజెక్ట్ చేశారు. ఉత్తర బెంగాల్ (North Bengal) గ్రామాలలోని పిల్లలకు మెరుగైన విద్యను అందించడంలో సహాయపడటానికే వారు ఇలాంటి సువర్ణావకాశాన్ని సింపుల్‌గా వదిలేసుకున్నారు. భార్యాభర్తలైన వీరు ఇప్పటికే మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతున్నారు. ఈ లైబ్రరీతో లేటెస్ట్ బుక్స్‌తో పిల్లలను అప్‌డేటెడ్‌గా ఉంచుతూ సప్లమెంటరీ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు.
ఈ మొబైల్ లైబ్రరీ పిల్లల కోసం పాఠ్యపుస్తకాలను (Textbooks) కలిగి ఉంటుంది. వాటిలో చాలా వరకు సిలిగురి (Siliguri) నగరవాసుల నుంచి సేకరించారు. మరికొన్ని అనిర్బన్, పౌలమి కొనుగోలు చేశారు. ఈ మొబైల్ వ్యాన్ లైబ్రరీలో ప్రస్తుతం 5,200 పుస్తకాలు ఉన్నాయి. అనిర్బన్, అతని భార్య పౌలమి ఈ వ్యాన్‌ని నార్త్ బెంగాల్‌లోని 30 గ్రామాలకు తీసుకువెళ్లి అక్కడ పిల్లలకు స్టడీ బుక్స్ అందజేస్తారు. ప్రతి మూడు నెలలకోసారి ఈ బుక్స్ ని రెన్యూవల్ చేస్తారు. పుస్తకాలు మాత్రమే కాదు, ఈ మొబైల్ లైబ్రరీ ద్వారా గ్రామీణ పిల్లలకు రూ.10కే ట్యూషన్‌ను కూడా చెప్తారు. ఈ దంపతులు గ్రామీణ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు నుంచి కంప్యూటర్‌ల వరకు వైవిధ్యమైన కోర్సులను బోధిస్తున్నారు.
అనిర్బన్ తండ్రి రైతు.. అతని తల్లి నర్సు. ఇలాంటి సాధారణ కుటుంబ నేపథ్యంతో వచ్చిన అతను చిన్నతనం నుంచి గ్రామాభివృద్ధి కోసం పని చేయాలనే ఆసక్తితో ఉండేవారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రూరల్ డెవలప్‌మెంట్ లేదా గ్రామీణాభివృద్ధిపై పరిశోధన చేస్తున్నప్పుడు గ్రామస్తులు ఫేస్ చేసే వివిధ సమస్యలను అనిర్బన్ తెలుసుకున్నారు. పౌలమి ఆ సమయంలో అదే ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి చివరికి పెళ్లికి దారితీసింది.
“మొబైల్ లైబ్రరీ ప్రజలతో కనెక్ట్ అవుతుంది, మేం మరింత మంది వ్యక్తులను శక్తివంతం చేయాలి. మేం ఇండియా బయట ఉండి పోస్ట్-డాక్టరేట్ చేసే అవకాశాన్ని పొందాం. అయితే దానికంటే గ్రామాల్లోని స్త్రీలు, పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం, వారిని శక్తివంతం చేయడం మనకు ఆనందాన్ని ఇస్తుంది. మేం ఏసీ గది నుంచి ప్రచారం చేయాల్సిన సిద్ధాంతాలను ఇప్పుడు ఈ విలేజ్ హోమ్స్ నుంచి చేస్తున్నాం, అది మాకు సంతృప్తిని కలిగిస్తుంది." అని న్యూస్18తో మాట్లాడుతూ అనిర్బన్ చెప్పుకొచ్చారు.
జల్పాయిగురి, డార్జిలింగ్, అలీపుర్‌దువార్ గ్రామాలు చాలావరకు ఉద్యానవనాలుగా ఉంటాయి. అనిర్బన్, పౌలమి కలిసి స్థాపించిన సంస్థ 'లీవ్ లైఫ్ హ్యాపీలీ' గ్రామాల తల్లులకు శిక్షణనిస్తూ వారిని శక్తివంతం చేస్తుంది. ఇప్పుడు వారి బృందంలో 8000 మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందంగా పనిచేస్తున్నారు. న్యూస్ 18తో పౌలమి మాట్లాడుతూ, “సంతృప్తిని నేను వేరే స్థాయిలో పొందుతున్నాను. ఇంతకంటే సంతృప్తిని మనం మరెక్కడా పొందలేం. మేం వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." అని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g mobile, Career and Courses, Library, Students