దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ఒకటి. ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను లాంచ్ చేస్తోంది. తాజాగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో కొత్త M.A ప్రోగ్రామ్‌ను IIT Madras ప్రారంభించింది. ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన డెవలప్‌మెంట్ స్టడీస్, ఇంగ్లీష్ స్టడీస్‌కు కొత్తగా ఎకనామిక్స్‌ను జోడించడం ద్వారా MA ప్రోగ్రామ్ పరిధిని మరింత విస్తరిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ MA ప్రోగ్రామ్‌లకు బదులుగా ఈ మూడు స్ట్రీమ్‌లను రెండేళ్ల ప్రోగ్రామ్స్‌గా అందించనుంది. ఈ ప్రోగ్రామ్స్ 2023 అకడమిక్ సెషన్ నుంచి ప్రారంభమవుతాయని ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత వివిధ స్ట్రీమ్‌లో MA ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత వైవిధ్యమైన అభ్యర్థులను ఆకర్షించాలని ఐఐటీ మద్రాస్ భావిస్తోంది.
తాజా కోర్సుల గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడారు. “హుమ్యానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్‌లోని వివిధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన మరింత మంది విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఎంఏ ప్రోగ్రామ్‌ల్లో మార్పులు చేశాం. ఆధునిక ప్రపంచంలోని విభిన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, వాటిని పరిష్కరించడానికి తదుపరి తరాల విద్యార్థులకు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ప్రాధాన్యతను తెలియజేయాలి. ఈ MA ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ, జాతీయ దృష్టితో డొమైన్ నిర్దిష్ట నిపుణులుగా మారడానికి శిక్షణ ఇవ్వనున్నాం. దీంతో భవిష్యత్‌లో ప్లేస్‌మెంట్, ఉపాధికి ఈ ప్రోగ్రామ్ కొత్త మార్గాలను తెరుస్తుంది.’’ అని ప్రొఫెసర్ కామకోటి అభిప్రాయపడ్డారు.
ఎకనామిక్స్ ఆఫ్ ఇన్నోవేషన్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, హెల్త్ పాలసీ, ఎన్విరాన్‌మెంటల్ హ్యుమానిటీస్, క్లైమేట్ ఎకనామిక్స్, టెక్నాలజీ అండ్ పాలసీ, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వంటి సమకాలీన అంశాలను కోర్సులో ప్రవేశపెట్టడం కోసం ఎంఏ ప్రోగ్రామ్ పాఠ్యాంశాల్లో మార్పులు చేర్పులు చేశారు.
ఒక్కో స్ట్రీమ్ కింద భారతీయ విద్యార్థులకు 25 సీట్లు ఉంటాయి. సూపర్‌న్యూమరీ ప్రాతిపదికన అంతర్జాతీయ విద్యార్థులకు కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి/ఏప్రిల్ 2023లో ప్రారంభమవుతుంది. తరగతులు 2023 జూలైలో ప్రారంభమవుతాయి. రెండేళ్ల M.A. ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను త్వరలో ప్రకటించబోయే ప్రవేశ పరీక్ష ఆధారంగా ఐఐటీ మద్రాస్ చేపట్టనుంది.
మరోవైపు, కంప్యూటర్ సైన్స్‌లో నాణ్యమైన కోర్సులను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం ఐఐటీ మద్రాస్ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇన్‌స్టిట్యూట్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఫ్యాకల్టీ... కోర్ కోర్సులకు సంబంధించి పోర్టల్‌ను రూపొందించింది. విద్యా సంస్థలు, విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ కోర్సులను యాక్సెస్ చేసుకోవచ్చని ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ప్రధానంగా ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, అల్గారిథమ్‌లపై కోర్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు nsm.iitm.ac.in/cse/ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IIT, IIT Madras, JOBS