ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) ‘నిలేకని సెంటర్ ఎట్ ఏఐ4భారత్’(Nilekani Centre at AI4Bharat)ను గురువారం లాంచ్ చేసింది. ఈ సెంటర్ భారతీయ భాషా సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి పనిచేయనుంది. నీలేకని ఫిలాంత్రపీస్ ద్వారా రోహిణి, నందన్ నీలేకని ఈ సెంటర్‌కు రూ.36 కోట్ల గ్రాంట్ ఇచ్చి మద్దతుగా నిలిచారు. భారతీయ భాషా సాంకేతికతలను రూపొందించడానికి, అందుబాటులో ఉన్న వనరులను చర్చించడానికి విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌ల కోసం ఓ వర్క్‌షాప్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
భారతీయ భాషల కోసం ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ ఏఐ(AI)ను రూపొందించడానికి, ఐఐటీ మద్రాస్ చొరవతో ‘ఏఐ4భారత్’ ఏర్పాటైంది. గత రెండు సంవత్సరాలుగా డాక్టర్ మితేష్ ఖాప్రా, డాక్టర్ ప్రత్యూష్ కుమార్, డాక్టర్ అనూప్ కుంచుకుట్టన్ నేతృత్వంలోని బృందం మెషిన్ ట్రాన్స్‌లేషన్, స్పీచ్ రికగ్నిషన్ కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్‌లతో సహా భారతీయ భాషా సాంకేతికతకు అనేక సహకారాలు అందించింది.
నందన్ నీలేకని మాట్లాడుతూ.. ‘కొలాబొరేటివ్ ఏఐ (collaborative AI) సహకారంతో పౌరులకు వారి సొంత భాషలో అన్ని సేవలు, సమాచారం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో డిజిటల్ ఇండియా భాషిణి మిషన్‌ను ఇప్పటికే లాంచ్ చేశాం. ఇక AI4Bharat కూడా ఇండియన్ లాంగ్వేజ్ ఏఐ వర్క్‌ను ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో చర్యలను వేగవంతం చేస్తుంది. ఇది భాషిణి మిషన్ లక్ష్యాలకు పూర్తి అనుగుణంగా ఉంటుంది.’ అని తెలిపారు.
ఐఐటీ మద్రాస్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మితేష్ ఎం ఖప్రా మాట్లాడుతూ.. ‘‘దేశంలోని భాషల గొప్ప వైవిధ్యం, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా భాషా సాంకేతికతలో గణనీయమైన పురోగతి సాధించడం చాలా ముఖ్యం. ఇంగ్లీషు, మరికొన్ని భాషలకు భాషా సాంకేతికత గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఈ విషయంలో భారతీయ భాషలు వెనుకబడి ఉన్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడంపై ఈ సెంటర్ (ఏఐ4భారత్) దృష్టి సారించనుంది.’’ అని తెలిపారు.
ఐఐటీ మద్రాస్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ పరిశోధకుడు డాక్టర్ ప్రత్యూష్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంస్థలు ఇంటరాక్షన్ కావడానికి ఏఐ4భారత్ సెంటర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజా అవసరాల కోసం ఈ సెంటర్ భాషా సాంకేతికతపై అత్యాధునిక AI పరిశోధనను, ఓపెన్ డేటాసెట్స్, అప్లికేషన్లను అనుమతించనుంది.’’ అని ఆయన తెలిపారు.
మైక్రోసాఫ్ట్ పరిశోధకుడు డాక్టర్ అనూప్ కుంచుకుట్టన్ మాట్లాడుతూ... విభిన్న భారతీయ భాషల కోసం AI సాంకేతికతలను రూపొందించడానికి భారీ డేటాసెట్స్, కంప్యూటింగ్ పవర్ అవసరం ఉందన్నారు. పైగా ఇవి చాలా ఖరీదైనవని తెలిపారు. ఈనేపథ్యంలో ఓపెన్ సోర్స్ AIను రూపొందించే ప్రయత్నాలకు అనేక సంస్థలు మద్దతు ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఇప్పటికే ఈ సెంటర్ అనేక అత్యాధునిక వనరులను ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉంచింది. వీటిని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సెంటర్ వెబ్‌సైట్ ai4bharat.iitm.ac.in ద్వారా మోడల్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IIT, IIT Madras, JOBS, Technology