దేశంలోని ఐఐటీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌కు(Indian Institute of Madras) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ తాజాగా కంప్యూటర్ సైన్స్‌లో(Computer Science) అత్యంత నాణ్యమైన కోర్సులను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇన్‌స్టిట్యూట్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(Computer Science And Engineering) విభాగానికి చెందిన ఫ్యాకల్టీ కోర్ కోర్సుల పోర్టల్‌ను(Portal) ఐఐటీ మద్రాస్(Madras) రూపొందించింది. విద్యా సంస్థలు, విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ కోర్సులను యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్‌లు, కంప్యూటర్ ఆర్గనైజేషన్(Computer Organization), అల్గారిథమ్‌లపై కోర్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు nsm.iitm.ac.in/cse/ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. మహమ్మారి కరోనా సమయంలో ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థుల లెక్చర్స్‌కు సంబంధించిన యూట్యూబ్ రికార్డింగ్‌లు ప్రతి కోర్సుకు అందుబాటులో ఉన్నాయి.
ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ... అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిల్లో CSE కోర్ కోర్సుల్లో లైవ్ క్లాస్ రికార్డింగ్స్, సబ్జెక్టు కాన్సెప్ట్స్, ఫార్ములాలను సరైన పద్ధతిలో నేర్చుకోవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ భావిస్తుందన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల అద్యాపకులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ప్రాథమిక విషయాలను సమర్థవంతంగా బోధించడానికి లైవ్ టీచింగ్స్ రికార్డింగ్‌లు ఉపయోగపడతాయని చెప్పారు. అంతేకాకుండా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలతో విద్యార్థులను ఏవిధంగా సన్నద్ధం చేయాలో తెలుస్తుందన్నారు. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో CSE కోర్ సబ్జెక్టుల్లో టీచింగ్ అండ్ లెర్నింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి ఈ పోర్టల్ బాగా ఉపయోగపడుతుందని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.
ఐఐటీల్లో ఎక్కువగా కోరుకునే ఇంజనీరింగ్ విభాగాలలో కంప్యూటర్ సైన్స్ ఒకటి. విద్యార్థులకు దీనిపై అధిక ఆసక్తిని కనబర్చుతుంటారు. ఐఐటీలలో ఈ స్ట్రీమ్‌కు అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సీట్లు మాత్రం పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటాయి.
ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రూపేష్ నస్రే ఈ కార్యక్రమం హైలైట్స్‌ను వివరించారు. IIT మద్రాస్‌లో చదవలేని విద్యార్థులు, ముఖ్యంగా దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సహాయం చేయడానికే ఈ పోర్టల్ సృష్టించామని తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ లో బోధించే అదే పాఠ్యాంశాలను వారు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని అన్నారు. నాణ్యమైన మెటీరియల్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా ఐఐటీ మద్రాస్ చొరవ తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా డిపార్ట్‌మెంట్ సీనియర్ విద్యార్థులతో ప్రత్యక్ష ట్యుటోరియల్ సెషన్‌లను కూడా నిర్వహించాలని ఐఐటీ మద్రాస్ యోచిస్తోందని.. తద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ డాక్టర్ రూపేష్ నస్రే అభిప్రాయపడ్డారు.
ఈ పోర్టల్ ద్వారా ప్రయోజనం పొందిన అభిషేక్ ధీమాన్ అనే విద్యార్థి స్పందించాడు. ‘‘నేను IIT మద్రాస్ విద్యార్థిని కానప్పటికీ, ఈ అద్భుతమైన చొరవ కారణంగా నేను ఇన్‌స్టిట్యూట్ ఉపన్యాసాలను యాక్సెస్ చేయగలుగుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. సెల్ఫ్-అసెస్‌మెంట్ కోసం విద్యార్థులు పోర్టల్‌లో క్విజ్ పోటీల్లో కూడా పాల్గొనవచ్చు. అదేవిధంగా కోర్సులపై అవగాహన స్థాయిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో రాండమైజ్డ్ క్విజ్‌లను రూపొందించాలని డిపార్ట్‌మెంట్ యోచిస్తోంది. అన్ని అంశాలు కలిసి కోర్సు నేర్చుకోవడానికి విద్యార్థులకు సమగ్ర ప్యాకేజీని అందించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IIT Madras, Job portals