Afghanistan Crisis: అఫ్గాన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్.. హాస్టళ్లలో చేరడానికి అనుమతి.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

గతంలో పౌర హక్కులను కాలరాసిన తాలిబన్లు మళ్లీ అధికారం చేపడితే, పరిస్థితి ఏంటనే భయంలో అఫ్గానిస్థాన్‌ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తీవ్ర సంక్షోభం సమయంలో ఐఐటీ బాంబే అక్కడి విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

  • Share this:
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ భవితవ్యంపై అక్కడి పౌరులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పౌర హక్కులను కాలరాసిన తాలిబన్లు మళ్లీ అధికారం చేపడితే, పరిస్థితి ఏంటనే భయం అక్కడి యువత, మహిళలను వెంటాడుతోంది. దీంతో సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సైతం అక్కడి ప్రజలు వెనుకాడట్లేదు. ఈ క్రమంలో భారత దేశంలోని యూనివర్సిటీల్లో చదువుతున్న అఫ్గాన్‌ విద్యార్థులు, మళ్లీ తమను భారత్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఐటీ బాంబే. అఫ్గాన్ విద్యార్థులు క్యాంపస్‌ హాస్టళ్లలో చేరడానికి అనుమతించింది. అఫ్గాన్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్నారు. అయితే కోవిడ్ కారణంగా వారు సొంత దేశానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశంలో అస్థిర పరిస్థులు నెలకొనడంతో భారతీయ విద్యాసంస్థల్లో క్యాంపస్‌లకు తిరిగి వచ్చేందుకు అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థలో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చి చదువు కొనసాగించవచ్చని ఐఐటీ బాంబే ప్రకటించింది. ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాసిస్ చౌధురి ఫేస్‌బుక్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.
Kabul flight: కాబూల్​లో ఘోరం.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు వ్యక్తులు
Imran Khan: అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది.. ఇమ్రాన్ ఖాన్ విమర్శలు.. అందులో మాత్రం ఇండియాకే ప్రాధాన్యత..

ఈ సంవత్సరం కొంతమంది అఫ్గాన్ విద్యార్థులు ఐఐటీ బాంబేలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) నుంచి అందే స్కాలర్‌షిప్‌ల ద్వారా వారు వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందారు. కానీ ఈసారి కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారు ఆన్- క్యాంపస్ క్లాసులకు హాజరు కాలేకపోయారు. విద్యాసంస్థలు సైతం మూతబడటంతో ఈ విద్యార్థులంతా ఇప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులకే పరిమితమయ్యారు.

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ సంక్షోభం మరింత దిగజారింది. దీంతో తమ జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందువల్ల క్యాంపస్‌కు వచ్చి చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని అక్కడి విద్యార్థులు ఐఐటి బాంబేను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. అయితే అక్కడి విద్యార్థులను హాస్టల్‌కి వచ్చి చదువుకునేందుకు అనుమతిస్తున్నప్పటికీ, దీనివల్ల వారికి ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో తెలియదని ఐఐటీ బాంబే డైరెక్టర్ షేర్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఉంది. వారంతా సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published: