news18-telugu
Updated: June 15, 2020, 3:43 PM IST
ప్రతీకాత్మక చిత్రం
సీఏ 2020 పరీక్షలకు సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి సీఎ 2020 పరీక్షలు జూలై 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలను ర్దు చేయాలంటూ కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఏఐ విద్యార్థుల కోసం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. సీఏ 2020 పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేసే ప్రసక్తిలేదని తెలిపింది. అయితే ఈ పరీక్షలను రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఓ వెసులుబాటును కల్పించింది. ఈ విడతలో సీఏ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు నవంబరు 2020లో నిర్వహించే పరీక్షలకు హాజరుకావొచ్చని సూచించింది. వాస్తవానికి ఇప్పటికే సీఏ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేసిన నేపథ్యంలో ఐసీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ నేపథ్యంలో సీఏ పరీక్షలను రద్దు చేయాలంటూ డిమాండ్ విన్పిస్తున్న తరుణంలో ఐసీఏఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది విద్యార్థులు కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షా కేంద్రం, కంటైన్మెంట్ జోన్, భౌతిక దూరం, పరిశుభ్రత, రవాణ, వసతి సౌకర్యాలు, పరీక్ష ఫీజు కోల్పోవడం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఐసీఏఐ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఐసీఏఐ స్పందిస్తూ.. జూలైలో సీఏ పరీక్షలు రాయలేని విద్యార్థులు నవంబరులో రాసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు హాజరయ్యేందుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. జూలైలో పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు నవంబరులో హజరుకావాలని, అయితే వారి నుంచి పరీక్ష ఫీజును వసూలు చేయబోమని ప్రకటించింది.
కానీ దరఖాస్తు ఫీజు మాత్రం వసూలు చేస్తామని తెలిపింది. ఇదిలావుంటే.. జూలై 29 నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్తులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే పరీక్షా కేంద్రంలో మార్పులు చేసుకోవాలనుకునే విద్యార్థులు జూన్ 17 నుంచి 20వ తేదీ వరకు వెబ్సైట్లో మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. వెబ్సైట్లో జూలై పరీక్షకు సంబంధించిన డిక్లరేషన్ను ధ్రువీకరించాలని, పరీక్షను నవంబరుకు వాయిదా వేసుకోవాలనుకునే విద్యార్థులు వెబ్సైట్లో ఒకసారి ఆ ఆప్షన్ ఎంచుకుంటే.. అదే ఫైనల్గా పరిగణించనున్నట్టు పేర్కొంది.
Published by:
Narsimha Badhini
First published:
June 15, 2020, 3:43 PM IST