ఇంతకుముందు రోజుల్లో యువత సంప్రదాయ కోర్సులు (Courses) చేసి ఆయా రంగాల్లోనే స్థిరపడేవారు. ప్రస్తుతం వారి ఆలోచన మారుతోంది. సంప్రదాయ కోర్సులు కాకుండా వారికి ఆసక్తి ఉన్న, భిన్నమైన రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కొత్త కొత్త కోర్సులు రాగా, వాటికి బాగా డిమాండ్ పెరుగుతోంది. అలా ఆదరణ పెరుగుతున్న కోర్సుల్లో ఫొటోగ్రఫీ (Photography) ఒకటి. గత కొన్ని సంవత్సరాలలో ఫొటోగ్రఫీలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ రంగానికి సంబంధించిన కోర్సులు, కాలేజీలు, అవకాశాలు, మనకు ఉండాల్సిన నైపుణ్యాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
* కోర్సులు, కళాశాలలు
ఫొటోగ్రఫీలో ప్రొఫెషనల్ కోర్సు చేయాలని అనుకునేవారు BFA ఫోటోగ్రఫీ లేదా MFA ఫోటోగ్రఫీ చేయవచ్చు. వీటితో పాటు ఇంటర్ తర్వాత మీ ఆసక్తిని బట్టి సర్టిఫికేట్, డిప్లొమా లేదా అనేక బ్రిడ్జ్ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు చేసే అవకాశం ఉంది. AJK మాస్ కమ్యూనికేషన్ సెంటర్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ, AAFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ వంటి కాలేజీల నుంచి ప్రొఫెషనల్ కోర్సులు చేయొచ్చు.
ఏపీలో ఎడ్సెట్ ద్వారా డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేయవచ్చు. ఆంధ్రా యూనివర్సిటీలో ఆరు నెలల డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు అందుబాటులో ఉంది. తెలంగాణలో ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీల్లో దీనికి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు దేశంలోని పదుల సంఖ్యలో యూనివర్సిటీల్లో ఫొటోగ్రఫీ కోర్సులు ఉన్నాయి.
* ఎలాంటి అవకాశాలు ఉంటాయి
గత కొన్నేళ్లుగా ఈ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో, స్టిల్ లైఫ్ ఫొటోగ్రఫీలో, ఫొటో జర్నలిజంలో, విజువల్ కమ్యునికేషన్, వైల్డ్ లైఫ్, ట్రావెల్ ఫొటోగ్రఫీల్లో అవకాశాలు ఉంటాయి. ఇటీవల ఈవెంట్ ఫొటోగ్రఫీ బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందమైన క్షణాలను పదిలపరుచుకోవాలని చూస్తున్నారు. అందుకోసం సినిమాటిక్గా షూట్ చేయించి మరీ దాచుకుంటున్నారు. అందుకే ఇటీవల ఈవెంట్ ఫొటోగ్రఫీకి బాగా క్రేజ్ పెరిగింది. మీరు ఏదైనా సంస్థలో పనిచేయచ్చు. లేదంటే సొంతంగా ఫ్రీ లాన్సింగ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.
* అవసరమైన నైపుణ్యాలు
ఫొటోగ్రఫీ అనేది మిగిలిన వాటిలా రొటీన్ జాబ్ కాదు. సృజనాత్మకత, నైపుణ్యం ఎంతో అవసరం. మిగిలిన వారి కంటే వైవిధ్యంగా ఆలోచించగలగాలి. సమాజ అవసరాలు, మారుతున్న పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవాలి. మీలో ఉండే స్కిల్స్, వర్క్‌లో క్వాలిటీ బట్టి లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది. మీ వర్క్ స్టైల్ తెలిసేలా చక్కని పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకోండి. దాన్ని ఎంత బాగా తీర్చిదిద్దితే అంత మంచి అవకాశాలు వస్తాయి. అభిరుచి, ఆసక్తి లేకపోతే ఇందులో రాణించడం చాలా కష్టం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Career opportunities, EDUCATION, JOBS, Photography