బ్యాచిలర్ డిగ్రీలో(Bachelor Degree) మరో కొత్త కోర్సు తెలంగాణలో రాబోతోంది. డిమాండ్,ఇండస్ట్రీ అవసరాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త కోర్సులను రూపొందించి అమలు చేస్తున్నది. అందులోభాగంగా.. తాజాగా మరో కొత్త కోర్సు అమలుకు పచ్చజెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ను (Computer Science) ఆనర్స్ డిగ్రీ కోర్సుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో కొత్త కోర్సులపై చర్చించారు. తెలంగాణలోని పన్నెండు డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. మిగతా కాలేజీలు కూడా ముందుకు వస్తే.. అంన్నింటిలో ఈ కోర్సును అనుమతించాలని వీసీలు అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాది నుంచి దోస్త్ ద్వారా ఈ కోర్సు సీట్లను భర్తీ చేస్తారు. త్వరలోనే సిలబస్ కమిటీని వేస్తామని లింబాద్రి తెలిపారు. వీటితో పాటు.. డిగ్రీ ఫస్టియర్‌లో సైబర్ సెఫ్టీ సెక్యూరిటీ సబ్జెక్టు తీసుకురావాలన్న ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించింది. ఇప్పటికే బీఏ ఆనర్స్ హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టగా.. ఇవి విజయవంతంగా అమలవుతున్నాయి. తెలంగాణకు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తరలి వస్తున్నాయి. తెలంగాణ యువతకు ప్రైవేట్ రంగంలో కూడా పుష్కలంగా ఉద్యోగాలు ఉండపోతున్నాయి.
దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో అనేక సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకొన్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. అయితే ఈ ఐటీ కంపెనీలు అన్నీ.. కంప్యూటర్ సైన్స్ కోర్సు చేసిన వారినే రిక్రూట్ చేసుకునేందుకు మక్కువ చూపిస్తుండటంతో.. బీఎస్సీ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మన రాష్ట్ర కంపెనీల్లోని ఉద్యోగాలను మన విద్యార్థులు దక్కించుకొనేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఈ కోర్సును బీటెక్ డిగ్రీకి ధీటుగా తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. తెలంగాణలో ప్రతీ సంవత్సరం రెండు లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ చదువుతుండగా.. వాటిలో ఎక్కువగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అటు ఇంజనీరింగ్ లోనూ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. దీనిలో భాగంగానే.. డిగ్రీలోనూ హానర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సును తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Degree courses, JOBS, New courses